నవరాత్రారంభము
దేవీ భాగవతంలో భార్గావార్చన దీపికలో చండికా పూజా విధానం గూర్చి ఈ విధంగా వివరించారు.
శృణు రాజన్ ప్రవక్ష్యామి చండికా పూజ నక్రమమ్
ఆశ్వినస్య సితే పక్షే ప్రతిపత్సు శుభేదినే
మహారాజా! చండికా పూజా విధానమును వి నమని దేవి ఈ విధంగా ప్రారంభించెను
శుద్ధే తిధౌ ప్రకర్తవ్యం ప్రతిపచ్చోద్వ గామిని
ఆద్యాస్తు నాడికా: చత్వా షోడశ ద్వాదశాపివా
అపరాహ్ణే చ కర్తవ్యం శుద్ధ సంతతి కాంక్షిభి:
ఆశ్వయుజ శుక్ల ప్రతిపత్ శుభ దినమున శుద్ధ తిధి యందు ప్రతిపత్ తరువాతి కాలమునకు వ్యాపించి ఉండగా శుద్ధ సంతతి కోరువారు చండికా పూజను చేయవలెను. ఈ ప్రతిపత్ అమావాస్యతో కూడి ఉండగా ఈ వ్రతము ఆచరించరాదు. అమావాస్యతో కూడి ఉన్న ప్రతిపత్ నాడు కలశ స్థాపనం చేసినచో అరిష్టము జరుగునని మార్కండేయ పురాణమున దేవి చెబుతున్నది.
కలశస్థాపన తత్ర అరిష్టం జయాతే ధ్రువం
పూర్వ విద్ధాతు యా శుక్లా భవేత్ ప్రతిపదా శ్రిణి
నవరాత్ర వ్రతం తస్యాం న కార్యం శుభమిచ్ఛతా
దేశభంగో భవేత్తత్ర దుర్భిక్షం చోపజాయతే
నందాయాం దర్శయుక్తాయాం యత్రస్యాన్ మమ పూజనమ్
అమావాస్యతో కూడిన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు శుభమును కోరు వారు నవరాత్ర వ్రతమును చేయరాదు. అలా చేసినచో అనగా ఆనాడు నన్ను(దేవిని) పూజించినచో దేశ భంగము, దుర్భిక్షము సంభవించును. ఏమైనా భాద్రపద బహుళ అమావాస్యతో కూడుకున్న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు ఎట్టి పరిస్థితులలోను చండికా పూజను, కలశ స్థాపనను ఆచరించిన వారికి సంపన్నాశము, వంశనాశము, దేశనాశము, దుర్భిక్షాది ఉపద్రవములు కలుగును. అదే పరిశుద్ధమైన పాడ్యమి, ద్వితీయతో కూడుకున్న దానిని చూచి నవరాత్రి వ్రతం ప్రారంభించినచో అనంత సుఖమును పొందెదరు. ద్వితీయతో కూడుకున్న పాడ్యమినాడు వ్రతమును ప్రారంభించినచో శతయజ్ఞ ఫలమును పొందెదరని దేవీ పురాణమున చెప్పబడింది.
యా చాశ్వయుజి మాసే స్యాత్ ప్రతిపత్ భాద్రయాన్వితా
శుద్ధా మమార్చనం తస్యాం శతయజ్ఞ ఫలప్రదం
ప్రాతరావహయే ద్దేవీం ప్రాతరేవ విసర్జయేత్
దేవీ ఆవాహనము మరియు దేవీ విసర్జనను ప్రాత: కాలమున మాత్రమే చేయాలి. అంటే ప్రాత: కాలమే పాడ్యమి ఉండాలి. అమావాస్యతో కూడుకున్న పాడ్యమి నాడు కలశస్థాపన, దేవీ పూజ ఆచరించినచో రాజ్యనాశము, ప్రజాక్షయము సంభవించునని దేవీ పురాణమున చెప్పబడినది. తొమ్మిదిరోజులు ఈ వ్రతమును ఆచరించలేని వారు ఒక్కరోజైనా దేవీ పూజను చేయవచ్చని కాలికా పురాణమున చెప్పబడింది.
యస్త్వెకస్యాం అధాష్టమ్యాం నవమ్యాం అధ సాధక:
పూజయేత్ వరదాం దేవీం మహా విభవ విస్తరై:
అని 9 రోజులు వ్రతమాచరించలేని వారు ఈ నవరాత్రులలో ఒక రోజు కూడా ఆచరించవచ్చను. ఏదో ఒకరోజు చేయవచ్చును లేదా అష్టమి యందో నవమి యందో దేవిని తమకున్న విభవాన్ని ఉపయోగించి దేవిని పూజించాలి. ఇట్లు ముఖ్యంగా మహార్నవమి నాడు పూజాచరించినచో దేవి సర్వకామఫల ప్రదాయిని అయి మనకు యశస్సు, రాజ్యము, పుత్రులు, ఆయువు, ధనసంపదలు ఇచ్చును. ఈ వ్రతాచరణ వలన రాజసూయ యాగ ఫలం లభించును. ఈ వ్రతమును ఉపవాసంతో ఆచరించవలెను.
ఏకభక్తేన నక్తేన తధైవ అయాచి తేన చ
పూజనీయ జనై: దేవి స్థానే స్థానే పురే పురే
గృహే గృహే శక్తి పరై: గ్రామే గ్రామే వనేవనే
బ్రాహ్మణౖ: క్షత్రియై: వైశ్యై: శూద్రై: భక్తియుక్తై:
అని ఈ దేవి పూజను అన్నివర్ణముల వారు అన్ని విభవములతో అనగా ఉన్న దానితో ప్రతి గృహమున ప్రతి గ్రామమున ప్రతి పురమున ప్రతి వనమున ప్రతి పర్వత ప్రాంతమున దేవీ పూజను చేయవలెను. ఈ వ్రతము శక్తి ఉన్న వారు పరిపూర్ణ ఉపవాసముతో శక్తి లేని వారు ఏకభక్తంతో లేదా నక్త వత్రంతో పూజించవలెను. పగలు మహేశ్వరుడు, రాత్రి దేవి అని ‘ దివారూపో మహేశ్వర: రాత్రి రూపాతధా దేవీ ‘ అని దేవిరాత్రి రూపంగాన రాత్రి ఉపవాసంతో ఈ వ్రతం ఆచరించిన సర్వపాప ప్రణాశము, సర్వ కామ ప్రదము, సర్వశత్రు వినాశకము అని దేవీ పురాణంలో చెప్పబడింది. నవరాత్రుల లో నక్త వ్రతమును ఆచరించవలెను. నవరాత్రులను చెప్పినా ఒక తిథి క్షయమును పొంది అష్ట రాత్రులైననూ ఒక తిథి వృద్ధిని పొంది దశరాత్రమైనా ప్రత్యవాయము(పాపము) లేదు.
వ్రత విధానము :
ప్రాత:కాలం మంగళస్నానం ఆచరించి శుద్ధ మృత్తికతో వేదికను ఏర్పాటు చేసి గోధుములు, యవలు వేదికపై ఉంచి దానిపై మంత్ర పూర్వకంగా యధావిధిగా కలశము స్థాపించవలెను. సౌవర్ణము, రాజతము, తామ్రము లేక మృణ్మయముతో చేసిన కలశమును స్థాపించవలెను. ఈ కలశ స్థాపనమును నవాక్షరములు కల ”ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహా” జయంతి మంత్రముతో చేయవలెను. ఈ మంత్రమును జపిస్తూ పంచామృత అభిషేకము చేయవలెను. ” జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ దుర్గా క్షమా శివాధాత్రీ స్వధాస్వాహా నమోస్తుతే” అను మంత్రముతో జపహోమమును చేయవలెను. ప్రతిపత్ నాడు ప్రాత:కాలమున అభ్యంగన స్నానం చేసి పరిశుద్ధమైన వస్త్రములు ధరించి తమ ధర్మానుగుణంగా తిలకధారణ చేసి సంకల్పం చెప్పవలెను. సంకల్పమున దేశకాలములను కీర్తించాలి.
సంకల్పం :-
మమ ఇహ జన్మని దుర్గా ప్రీతి ద్వారా
సర్వాపచ్ఛాంతి పూర్వకం దీర్ఘాయు:
విపుల ధన పుత్ర పౌత్రాది అనవచ్ఛిన్న
సంతతి వృద్ధి స్థిరలక్ష్మీ కీర్తి లాభ
శత్రు పరాజయ సదాబీష్ట సిధ్యర్థం
శారదా నవరాత్ర ప్రతిపది విహిత
కలశ స్థాపన దుర్గా పూజాది కరిష్యే
అని సంకల్పం చెప్పి ”మహీద్యౌ:’ అను మంత్రముతో భూమిని స్పృశించి ‘ఓషధయ: సంవదంతే’ అను మంత్రముతో యవల నుంచి ‘ఆకలశేషు’ అని కలశమును స్థాపించి ‘ఇమం మే గంగే’ అని జలమును నింపి ‘గంధద్వారాం’ అని గంధమును. ‘యాఓషధీ:’ అని సర్వ ఓషధులను, ‘కాండాత్ కాండాత్’ అని దూర్వను, ‘అశ్వత్ధే వ:’ అను మంత్రముతో పంచపల్లవములను ఉంచి, ‘స్యోనా పృథివీ’ అని సప్త మృత్తికలను, ‘యా: ఫలా’ అని ఫలములను, నారికేల ఫలమును, ‘సహిరత్నాని’ అని నవరత్నాలను, ‘యువాసువాసా:’ అని వస్త్రమును, ‘పూర్ణా దర్వీ’ అని పూర్ణ పాత్రను ఉంచి ఆ కలశములో వరుణిని ఆవాహన చేసి పూజించి నూతన దుర్గా ప్రతిమ లేనిచో పాత దుర్గా ప్రతిమలో దుర్గను ఆవాహనం చేసి దుర్గాపూజను ఆచరించవలెను.
ఆహ్వాన మరియు ప్రార్థనా మంత్రం..
ఆగచ్ఛ వరదే దేవీ దైద్య దర్ప వినాశినీ
పూజాం గృహాణ సు ముఖి నమస్తే శంకర ప్రియే
సర్వతీర్థమయం వారి సర్వదేవ సమన్వితం
ఇమం ఘటం సమాగచ్ఛ తిష్ట దేవ గణౖ: స హ
దుర్గేదేవి సమాగచ్ఛ సాన్నిధ్య మిహకల్పయా
”బలిం పూజాం గృహాణత్వం అష్టాభి: శక్తిభి: సహ ” అనగా అష్ట శక్తులతో కూడియున్న దుర్గను స్థాపించాలి. ఒక్కొక్క రోజు ఏకైక వృద్ధిగా కన్యా పూజను ఆచరించవలెను. అనగా మొదటి రోజు ఒక కన్యను, రెండవ రోజు ఇద్దరిని, మూడవ రోజు ముగ్గురిని ఇలా ఒక్కొక్కరిని పెంచుతూ 9వ రోజు నవ కన్యలను పూజించవలెను. రెండు సం||రాల వయస్సు నుండి పది సంవత్సరాల వయస్సు గల కన్యలను ఆరాధించవలెను. ఈవిధంగా శక్తి లేనిచో రోజుకొక కన్యను ఆరాధించవలెను. ఆ శక్తి కూడా లేనిచో చివరి రోజు నాడు ఒకే కన్యను నవదుర్గాత్మికగా భావించి ఆవాహన చేసి కంచుక, వస్త్ర, గంధ, పుష్పాక్షితలతో పూజించి భక్ష్య, భోజ్య, లేహ్య పానీయాదులతో, షడ్రసములతో భుజింప చేయవలయును. ఈ నవరాత్రులలో శ్రద్ధా, శక్తి, భక్తి కలవారు నాలుగు వేదముల పారాయణమును వేద విద్వాంసులతో చేయించవలెను. అలాగే దుర్గాసప్తశతీ, చండీ సప్తశతీ పారాయణం చేయించవలెను.
ఆశ్వయుజ మాసము కావున అశ్వ పూజనము చేయవలెను మరియు సదాచార సంపన్నుడు, పరిశుద్ధ వ్రతుడు అయిన హయగ్రీవ స్వామిని ఈ నవరాత్రులలో ఆరాధించవలెను. ఉచ్ఛైశ్రవము, తిందునాకము, భద్రాశ్వము, వాజపాయము, బహుళాశ్వము, కుమారాశ్వము, రేవత్యశ్వము, హర్యశ్వము, జవనాశ్వము అని తొమ్మిది అశ్వములను హయగ్రీవ స్వామి చుట్టూ ఉంచి ఆరాధించవలెను. ఈ హయగ్రీవ పూజను ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, స్వాతి నక్షత్రం నాడు ప్రారంభించి శతభిష నక్షత్రము నాడు ముగించవలెను. హయగ్రీవ ఆరాధనకు ముందు లక్ష్మీదేవిని కూడా ఆరాధించవలెను. ఈవిధంగా నవరాత్రులలో లక్ష్మీహయగ్రీవ ఆరాధనను చేసిన వారికి సకల వేద పారంగతత్వము, సకల శాస్త్ర పాండిత్యము, సకల విద్యా ప్రావిణ్యం లభిస్తుందని బ్రహ్మాండ, పాద్మ పురాణాలలో వివరించి ఉన్నారు.
ఈ నవరాత్రులను శ్రీరామ నవరాత్రులని కూడా విష్ణు భక్తులు ఆచరిస్తారు. శ్రీరామచంద్రునికి ప్రతీ రోజు విశేషారాధన చేస్తూ తొమ్మిది రోజులు శ్రీమద్రామాయణ పారాయణాన్ని బ్రాహ్మణోత్తములతో చేయిస్తారు. ఉదయం ఆరు నుండి పన్నెండు గంటల వరకు ఆరు గంటల పాటు శ్రీమద్రామాయణ పారాయణం జరిపించవలెను. ఈవిధంగా తొమ్మిది రోజులు అనగా యాభైనాలుగు గంటలలో 24000 శ్లోకాల రామాయణాన్ని పారాయణ చేయాలి. సమయం సరిపోని వారు మరో రెండు గంటలు ఎక్కువ పారాయణ చేస్తారు. అలాగే శ్రద్ధాభక్తులు ఉన్నవారు సాయంత్రం రామాయణ ప్రవచనాన్ని చెప్పించుకుని కథా శ్రవణం చేస్తారు. విజయ దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం చేసి బ్రాహ్మణులకు, బంధుమిత్రులకు, పేదలకు భోజనం పెట్టి తాంబూల, వస్త్ర, దక్షిణాదులను ఇచ్చి సాయంత్రం శమీ పూజకు చేస్తారు. ఈ విధంగా దేవీ నవరాత్రులు,శ్రీరామ నవరాత్రులు, శరన్నవరాత్రులుగా పిలువబడే ఈ తొమ్మిది రోజులకు వైదిక, పౌరాణిక, సాంప్రదాయబద్ధమైన ఆచారం కలదు. వారి వారి శక్తి, ఉత్సాహాలకు అనుగుణంగా భగవత,భాగవత, ఆచార్య ఆరాధన చేసి అమ్మ, స్వామి వార్ల దయను పొంది చరి తార్థులు కావాలని ఆశిద్దాం.
……………………………………………………………………………….