Saturday, November 23, 2024

ఆరోగ్య యోగము

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీ.పూ.100- 500వ శకము మధ్యకాలములో పతంజలి యోగసూత్రాలను రచించినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీతలలో యోగా ప్రస్థావన కలదు. వాటి నుంచి పతంజలి క్రోడీకరించినవే యోగసూత్రాలు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లుగా యోగ సూత్రాలను పతంజలి ఒకచోట కూర్చి మనకు అందించెను.
వాటిలో హఠయోగ ప్రదీపిక, శివసంహిత ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలగునవి హిందూతత్త్వములో భాగాలు.
భగవద్గీతలో యోగములు 18 అధ్యాయములుగా విభజించి చెప్పబడినవి.
యోగము అనే పదము ‘యుజ్‌’ అనే ధాతువు నుండి ఉత్పన్నమైనది. యుజ్‌ అంటే కలయిక. ”యుజ్యతే ఏతదితి యోగ:”, ”యుజ్యతే అనేన ఇతి యోగ:” వంటి నిర్వచనాల ద్వారా ఏర్పడినది. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట, ఇంద్రియములను వశపరచుకొనుటకు శారీరిక వ్యాయామ ప్రక్రియలనే లౌకికంగా యోగా అని వ్యవహరించటం జరుగుతోంది. ఇంద్రియ నిగ్ర#హము కలిగినప్పుడు మనసు ఏకాగ్రతతో ధ్యాన సాధన చేసి మోక్ష సాధన చేయగలము. ఇటువంటి ఏకాగ్రతతో పరమార్థ తత్త్వమునకు త్రోవ చేసుకొనిపోవచ్చును. ఆత్మ తనలోని గూఢంగా ఉన్న నిజశక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధ యోగ విధానాలలో సూత్రకారులు విభజించారు. యోగము అనగా సాధన, అదృష్టము అనే రెండు అర్థాలున్నాయి. భారతీయ తత్త్వశాస్త్రములోని ఆరు దర్శనాలలో ‘యోగ’ లేదా ‘యోగదర్శనము’ వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగము. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంత: దృష్టి, పరమానంద ప్రాప్తిలాంటి ఆధ్యాత్మికపరమైన సాధనలకు పునాది. హఠ యోగములో భాగమైన శారీరక ఆసనాలు శరీరారోగ్యానికి, మానసిక వికాశానికి, శరీర ధారుఢ్యానికి, ముఖవర్చస్సు ఇనుమడింపచేయటానికి దోహదం చేస్తాయి.
మనకి ప్రధానంగా ఆరోగ్యమే మహాభాగ్యము కనుక యోగాసనాల గురించి తెలుసుకోవాలి.

యోగాసనాలు

యోగాసనాలు 15 విధాలుగా ఉన్నాయి. ఓంకారము, పద్మాసనము, సిద్ధాసనము, గోముఖాసనము, చక్రాసనము, ధనురాసనము, పవన ముక్తాసనము, మకరాసనము, మత్స్యాసనము, భుజంగాసనము, శశాంకాసనము, వజ్రాసనము, ఉదరాకర్షనాసనము, హలాసనము మరియు సర్వాంగాసనము. ఈవిధమైన ఆసనాలు శిక్షణ పొంది నిత్యము సాధన చేసినట్లయితే శరీరధారుడ్యము, ఆరోగ్యము పొందవచ్చును. అయితే ఇవి శరీరమునంతటిని ప్రభావితము చేసి ఆరోగ్యవంతమైన ఫలితాలిస్తాయి. స్వరసాధన, శుద్ధిక్రియలు, యోగికంగా సూక్ష్మ, స్థూల ఆసనాలు లేక వ్యాయామము లేక ఆసనాలు ఒకదానికొకటి సంబంధము కలిగి ఉన్నాయి. ఇవి ఒక క్రమములో చేసినట్లయితే అదిక ప్రయోజనము పొందవచ్చును. మనస్సును కామక్రోదాధి షడ్వికారముల నుండి దూరంచేసి బ్రహ్మ లేక పరమేశ్వరునితో జోడించటం యోగాభ్యాసముతోనే సాధ్యపడుతుంది. నిత్యము ఓంకార సాధన చేయాలి.

యోగిక స్థూల వ్యాయామము

వీటిని అయిదు విధాలుగా చేయవచ్చును. సూర్యనమస్కారములు, సర్వాంగపుష్టి, ఉత్కర్షణము, రేఖాగతి, ఊర్ధ్వగతి, హృద్గతి. యోగసూత్రములనే అష్టాంగ యోగము అనికూడా వ్యవహరిస్తారు. యోగిక సూక్ష్మ వ్యాయామము 10 విధాలుగా చేయవచ్చును. అవి ప్రార్థన, బుద్ధి లేదా ధృతి, శక్తి వికాసాలు, స్మరణ, మేధాశక్తి, నేత్రశక్తి, కర్ణశక్తి, మెడశక్తి, బాహుశక్తి, భుజబంధశక్తి.

- Advertisement -

పతంజలియోగ సూత్రములు (అష్టాంగయోగము)

1. యమము: అహంస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము.
2. నియమము: శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణి ధానము నియమములు అని వేదాంతసారం చెబుతుంది. తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతాపూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్ర#హము, జపము, అగ్నికర్మ. ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
3. ఆసనం: ”ఆసనం” అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే ”స్థిరసుఖాసనం” అన్నారు.
4. ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామము వలన దేహదోషాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం)తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
5. ప్రత్యాహారం: ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టిని గ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
6. ధారణ: ధారణ అంటే బ్రహ్మమును హృదయములో ధరించుట. ఇది మనోస్థితి.
7. ధ్యానము: ధ్యేయ వస్తువుపై మనసును లగ్నము చేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము.
8. సమాధి: నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ స్థితిలో అహంబ్రహ్మాస్మి అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
నిత్యము ఆసనములను క్రమబద్ధముగా చేయుచూ నూరు వసంతాల జీవితము ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చును. భారతదేశములో 21 జూన్‌ 2016 నుంచి యోగా దినోత్సవము జరుపుకుంటున్నాము. ఆరోగ్యమే మనకు ప్రధాన భాగ్యము కనుక ఆరోగ్యంతో ఉంటే అభివృద్ధికి బాటలు వేయాలనే ఆలోచన కలుగుతుంది. ప్రయత్నిస్తే తప్పక కార్యరూపం దాల్చి ఆభివృద్ధికి బాటలు వేస్తుంది. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
నేడు యోగా దినోత్సవం

– డా.దేవులపల్లి పద్మజ
9849692414

Advertisement

తాజా వార్తలు

Advertisement