Friday, November 22, 2024

అభయ ప్రదాత శ్రీ లక్ష్మీనరసింహుడు

బ్రహ్మ దేవుడి సంకల్ప మాత్రం చేత జనించిన సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతుడు అనే నలుగురు బ్రహ్మ జ్ఞానులైన బాలురు విష్ణుమూర్తి దర్శనార్థం వైకుంఠం చేశారు. ఆరు సంవత్సరాల వయసు గల వారిగా దిగంబరులై వైకుంఠ ద్వారము కడ నిలుచున్నారు. విష్ణువుతో సంభాషించుటకు ఆతృతపడుతూ లోపలికి ప్రవేశింప బోయారు. కాని ద్వారపాలకులు అడ్డుకుని గెంటి వేసారు. సత్త్వ గుణ సంపన్నులైనా విష్ణు సందర్శన కోసం తొందర పడుతున్న వారు అసహనంతో వారిని రాక్షసులుగా పుట్టమని శపించారు. రజోగుణ, తమోగుణ ప్రధానులై రాక్షస గర్భమున జన్మించ మని, వైరభక్తితో మూడు జన్మలు అనుభవించి విష్ణు సాయుజ్యం పొందుతారని శరణు వేడిన ద్వారపాలకు లపై కరుణ చూపారు. వారు మొదటి జన్మలో దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా రెండో జన్మలో కైకశికి రావణుడు, కుంభకర్ణుడుగా, మూడోజన్మగా సాత్వతికి శిశుపా లుడు, దంతవక్త్రుడుగా జన్మించారు. విష్ణువు హిరణ్యాక్షుని యజ్ఞ వరాహావతారం దాల్చి సంహరించి భూమిని ఉద్ధరించాడు. తమ్ముని మరణాన్ని విన్న హిరణ్యకశిపుడు విష్ణువును తుద ముట్టించాలని నిరంతర శత్రు భావంతో అన్వేషించ సాగాడు. రాక్షసులను వెంటబెట్టుకుని యజ్ఞాలు, జప తపాలు చేసే రుషులను, మౌన వ్రతంలోనున్న వారిని సంహరించ సాగాడు. ఎక్కడ గోవులు, బ్రహ్మజ్ఞానులు సుఖంగా జీవిస్తారో ఆ ప్రదేశాలను ధ్వంసం చేస్తూ, భూలోకమంతా అల్లకల్లోలం చేయసాగారు. అప్పటికే గర్భవతిగా ఉన్న లీలావతికి జాగ్రత్తలు చెప్పి విష్ణువును సంహరించాలంటే అమేయమైన శక్తులు, వరములు అవసరమవుతాయని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయడానికి మంథర పర్వ తాన్ని చేరాడు. హిరణ్యకశిపుని తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లసాగాయి, అంత దేవతలందరూ తపస్సును ఆపించమని బ్రహ్మదేవుని వేడుకున్నారు. కీటకాలతో అస్తవ్యస్తమైన హిరణ్యకశిపుని శరీరం పై బ్రహ్మ తన దివ్య కమండలంలోని మంత్ర జలం చల్లాడు. వెంటనే గొప్ప తేజస్సుతో పుట్టల నుండి బయ టకు వచ్చాడు. బ్రహ్మ దేవునికి వినమ్రుడై నమస్క రించి స్తుతించాడు. అంత బ్రహ్మ వరమును కోరు కొన మని అడిగాడు.
గాలిలో కాని, ఆకాశంలో కాని, దిక్కులయందు కాని, రాత్రి, పగలు, చీకటి, వెలుగు, జంతువులు, జల చరాలు, పాములు, రాక్షసులు. దేవతలు, మానవులు, సమస్త అస్త్ర శస్త్రాల వలన మరణం లేకుండా కూడ అతని తపస్సుకు మెచ్చి వర ప్రదానం చేసేసాడు బ్రహ్మదేవుడు.
అంత కశ్యప పుత్రుడైన హిరణ్యకశిపుడు తపో అగ్నిలో భస్మమైపోయి ఉంటాడని భావించిన దేవతల రాజు ఇంద్రుడు. రాక్షస సంహారం చేయడానికి బయ లుదేరాడు. హిరణ్యకశిపుని రాజ్యాన్ని ధ్వంసం చేసిన ఇంద్రుడు హిరణ్యకశిపుని భార్య, గర్భవతి అయిన లీలావతిని బంధించి తీసుకుపోయాడు. దారిలో నారద మహర్షి ఎదురుపడి స్వర్గాధిపతిగా నీకిది తగ దని లీలావతిని విడిచిపెట్టమని చెప్పాడు. అంత ఇంద్రుడు ఈమె గర్భంలో రాక్షస బీజముందని బిడ్డ జన్మించగానే వజ్రాయుధంతో నాశనం చేసి రాక్షస జాతి నిర్మూలనం చేస్తానని క్రోధంతో ఊగిపోయాడు.
అంత నారద మహర్షి లీలావతి కడుపున వున్నది పరమ భాగవతోత్తముడని, హరిభక్తుడని, నీ పరాక్ర మమే కాదు సమస్త దేవతలు కూడా అతనిని ఏమి చేయలేరని కావున లీలావతిని విడిచిపెట్టమని సూచిం చాడు. నారద మహర్షి పలుకులు విన్న ఇంద్రుడు లీలా వతికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి నారదునికి అప్పగించాడు.
మహా పతివ్రత అయిన లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో మునులకు శుశ్రూషలు చేస్తూ సుఖంగా ఉంది. దివ్య జ్ఞాని అయిన నారదుడు లీలావతికి సమ స్త వేద సారాన్ని, జ్ఞానాన్ని, సర్వ ధర్మములను ఉప దేశించాడు. గర్భంలో ఉన్న శిశువు కూడా ఆ ఉపదేశ ములన్నియు ధారణ చేసాడు. ఆ మహాభాగవతుడే రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుడు జన్మించిన తరువాత హిరణ్యకశి పుడు వర గర్వంతో సమస్త దేవతలనూ గడగడలా డించసాగాడు. విష్ణువు నామాన్ని ఎక్కడా ఉచ్ఛరించ కుండా కట్టుదిట్టం చేసారు. విష్ణువు రాకకై ఎదురు చూడసాగాడు. నారద మహర్షి ఆశ్రమం నుండి ప్రహ్లాద లీలావతులను తన భవనానికి తీసుకుని వెళ్ళాడు. ప్రహ్లాదుని శుక్రాచార్యుని తనయుడు చండామా ర్కుల వారి గురుకులంలో విద్యాభ్యాసం చేయించ సాగాడు. కానీ రాక్షస విద్య పనికిరానిదని, మోక్షము నకు గమ్యము విష్ణువేనని కావున నారాయణ మంత్ర మును నిత్యమూ పఠించవలెనని మిగిలిన విద్యార్థు లకు బోధించసాగాడు ప్రహ్లాదుడు. అంతేకాదు, నారదుడు బోధించిన భక్తితత్త్వంతో ఓలలాడసాగారు. ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడు తుంది. ఇది త్రిగుణాత్మకమైనది. సంసారం ఒక స్వప్నం లాంటిది. విష్ణువుకు జనన మరణాలు లేవు. అజ్ఞానం వల్ల మనం ఆయనను చూడలేకపోతున్నాం. అజ్ఞానాన్ని నారాయణ మంత్రం అనే జ్ఞానంలో దగ్ధం చేయాలి. నిష్కల్మష, నిస్వార్ధమైన హృదయంతో ఆ విష్ణువును కనుగొనాలి. గురుసేవ, సమస్తం భగవద ర్పణ చేయడం, సజ్జన స్నేహం, దైవ విగ్రహారాధన, శ్రీహరి కథాశ్రవణం, నారాయణ మననం, వాస్తు సంకీర్తన, విష్ణు పాద ధ్యానం, విరాట్‌ స్వరూప దర్శ నం, పూజ ఈ పది భాగవత ధర్మాలు. అరిషడ్వర్గాలను జయించి భక్తితో పూజిస్తే విష్ణు సాన్నిధ్యం తప్పక లభి స్తుందని పరమ భాగవతమూర్తి ప్రహ్లాదుడు తన తోటి వారికి బోధించే వాడు.
ప్రహ్లాదుని నారాయణ మంత్ర ఘోష విన్న చండామార్కులు హిరణ్యకశిపుని వద్దకు వెళ్ళి పరి స్థితిని వివరించారు. హిరణ్య కశిపుడు ఆగ్రహోదగ్రుడై కన్నకొడుకని కూడా చూడకుండా అనేక విధాల హింసించి చంపడానికి చికాకు కల్పించాడు. నిత్య మూ వైరములోనే విష్ణు నామాన్ని స్మరిస్తున్న హిరణ్య కశిపుడు కుమారుని ఏమి చేయలేక నీ నారాయణుడైన విష్ణువు ఎక్కడ ఉన్నాడో చూపించమని గద్దించాడు. సర్వమూ విష్ణుమయమయిన ఈ విశ్వంలో ఎక్కడ వెదికినా కన్పిస్తాడని చెప్పాడు ప్రహ్లాదుడు. సభా భవ నంలోని స్థంభములో నున్నాడా? అని ప్రశ్నిస్తూనే తన గదా ఘాతంతో స్థంభమును ఛేదించాడు హిరణ్య కశిపుడు. బ్రహ్మ వరమునకు అతీతంగా శ్రీహరి శ్రీ నర సింహా వతారంగా గర్జన చేస్తూ అరివీర భయంకరుడై స్థంభమును చీల్చుకొని అవలీలగా హిరణ్యకశిపుని తన అంకముపై పరుండ బెట్టి ద్వారా దేహళిపై కూర్చొని తన వాడియైన నఖములతో చీల్చి సంహరిం చాడు. దేవగణమంతా శ్రీ నారసింహుుని ఉగ్రరూప ము చూచి గడగడలాడగా తుదకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు శాంతిని కాంక్షిస్తూ స్తుతించగా విష్ణువైన శ్రీ నారసింహుడు తన ఉగ్రరూపాన్ని ఉపసంహరిం చాడు. తన భక్తులైన వారిని యుగయుగాన ఎటు వంటి ఆపదనుండైనా రక్షిస్తానని అభయమిచ్చి ప్రహ్లాదుని పట్టాభిషిక్తుని చేసాడు శ్రీ మహావిష్ణువు.

శ్రీ లక్ష్మీ నారసింహాయనమ:

– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement