రాగం : శివరంజని
ఆర్తుడ నేను
ప|| ఆర్తుడ నేను నీకడ్డమెందును లేదు
మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే
చ|| సర్వ సాక్షవి నీవు సర్వాంతరంగుడవు
సర్వ సర్వం సహా చక్రవర్తి
నిర్వాణ మూర్తి నిగమాంత కీర్తి
సర్వాపరాధములను క్షమియించవే
చ|| పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి నీవు
పరమ పరానంద పరమ పురుషా
కరిరాజ వరదా కారుణ్య నిలయా
శరణా గతుడ నన్ను సరిగావవే
చ|| అణువు లోపలినీవు ఆది మహత్తువునీవు
ప్రణుత శ్రీ వేంకట ప్రచుర నిలయ
అణి మాది విభవా ఆధ్యంత రహితా
గణుతించి నాపాల గలుగ వే నీవు