Friday, November 22, 2024

అన్నమయ్య సంకీర్తనలు

రాగం : చక్రవాకం
త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును
ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేల || త్రికరణ ||

తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి
కనకబిందు యమునా గయూది ముఖ్య క్షేత్రంబుల సంతతమున్‌
దినకర సోమ గ్రహణకాలముల తీ ర్ధాచరణలు ఫలములు
తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు తిరుగగ మరియేల || త్రికరణ ||

హరియను రెండుక్షరములు నుడివిన అఖిల వేదముల మంత్రములు
గరిమ ధర్మశాస్త్ర పురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు
పరమ తపోయాగంబులు మొదలగు బహుసాధనముల సారంబు
పరిపక్వం బై ఫలింయించగా బట్టబయలు వెదకగనేల || త్రికరణ ||

మొదల శ్రీవేంకటపతికిని చేయెత్తి మొక్కిన మాత్రము లోపలనే
పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞంబులును
వదలక సాంగంబులుగా జేసిన వాడే కాడా పలుమారు
మదిమది నుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేల || త్రికరణ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement