రాగం : గౌళ
ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము
సారంబు దెలిసికా జయము చేకొనుట ||ఊరకే||
తలపులోపలి చింత – దాటినప్పుడు గదా
అలరిదైవంబప్ర – త్యక్షమౌట
కలుషంపు దుర్మదము – గడచినప్పుడు గదా
తలకొన్న మోక్షంబు – తనకు జే పడుట ||ఊరకే||
కర్మంబు కసటువో – కడిగినప్పుడు గదా
నిర్మల జ్ఞానంబు – నెరవేరుట
మర్మంబు శ్రీహరిని – మఱగు జొచ్చినగదా
కూర్మి తన జన్మమె – క్కుడు కెక్కుడౌట ||ఊరకే||
తన శాంత మాత్మలో – దగలినప్పుడు గదా
పనిగొన్న తన చదువు – ఫలియించుట
ఎనలేని శ్రీవేంక – టేశ్వరుని దాస్యంబు
తనకు నబ్బిన గదా – దరిజేరి మనుట ||ఊరకే||