రాగం : ఖమాస్
సింగార మూరితివి
సింగార మూరితివి చిత్తజ గురుడవు
సంగతి జూచేరు మిమ్ము సాసముఖా || సింగార మూరితివి ||
పూవుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి
పూవులు ఆకసము మేవ పూచి చల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా
సావధానమగు నీకు సాసముఖా || సింగార మూరితివి ||
అంగరంగ వైభవాల అమర కామినులాడ
నింగి నుండి దేవతలు నిను చూడగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయగా
సంగడి దేలేటి మీకు సాసముఖా || సింగార మూరితివి ||
పరగ కోనేటిలోన పసిడి మేడ నుండి
అరిది ఇందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీ వేంకటేశ కన్నుల పండువగాగ
సరవి నోలాడు మీకు సాసముఖా || సింగార మూరితివి ||