విరహపురాజదె
రాగం : తోడి
విరహపు రాజదె విడిదికి రాగా
సిరుల జేసెనిదె సింగారములు || విరహపురాజదె ||
నెలత నుదుటిపై నీలపు కురులనె
తొలుతనె గట్టెను తోరణము
మొలక చెమటలనె ముత్యపు మ్రుగ్గులు
అలరిచె మదనుండదె చెలిమేన || విరహపురాజదె ||
దట్టముగ చింతాలతనే వడి
బెట్టి చప్పరము పెనగొనగా
పట్టినమై తావులు పరిమళములు
కట్టించెను చెంగట వలరాజు || విరహపురాజదె ||
విందగు వేంకట విభుని ప్రేమచే
పొందగు బెట్టెను బోనాలు
ఇందువదనకి ఇందిరా విభునికి
కందుదేర నలుకలు చవిజేసె || విరహపురాజదె ||