అన్నమయ్య కీర్తనలు : నల్లని మేని నగవు
నల్లని మేని నగవు చూపులవాడు
తెల్లని కన్నుల దేవుడు || ||నల్లని మేని నగవు||
బిరుసైన దనుజుల పింఛమణచినట్టి
తిరుపుకైదువుతోడి దేవుడు
సరిబడ్డ జగమెల్ల చక్కజాయకు తెచ్చి
తెరువు చూపినట్టి దేవుడు || ||నల్లని మేని నగవు||
నీట కలసినట్టి నిండిన చదువులు
తేట పరచినట్టి దేవుడు
పాటిమాలినట్టి ప్రాణుల దురితవు
తీటవాసినట్టి దేవుడు || ||నల్లని మేని నగవు||
గురుతు వెట్టగరాని గుణముల నెలకొన్న
తిరు వేంకటాద్రిపై దేవుడు
తిరముగ ధ్రువునికి దివ్యపదం బిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుడు || ||నల్లని మేని నగవు||