రాగం : కాపీ
సందడి సొమ్ముల తోడి
సందడి సొమ్ముల తోడి సాకారమిదె వీడె
యిందరు వర్ణించరే యీ రూపము ||సందడి సొమ్ముల తోడి||
చుక్కలతో నాకాశము సూటై నిలువబోలు
నిక్కి రత్నాల జలధి నిటు కాబోలు
మిక్కిలి నానా వర్ణ మేఘపంక్తి కాబోలు
యిక్కడనే నిలుచున్నది యీ రూపము ||సందడి సొమ్ముల తోడి||
నించిన పంచవన్నెల నీలగిరి కాబోలు
అంచల సంధ్యాకాల మది కాబోలు
చించకాతని మెరుగుల చీకటిది కాబోలు
యెంచగ నలవిగాదు యీ రూపము ||సందడి సొమ్ముల తోడి||
పున్నమ నమాసయు పోగై నిలువబోలు
పున్నతి యోగీంద్రుల ఊహ కాబోలు
పన్నిల బ్రహ్మాండాల భరణిది కాబోలు
యిన్నిట శ్రీ వేంకటేశ యీ రూపము ||సందడి సొమ్ముల తోడి||