సకల బలంబులు
రాగం : మోహన
సకల బలంబులు నీవే సర్వేశ్వరనాకు
అకలంకంబగు సుఖమే అన్నిట నిదే నాకు || సకల బలంబులు ||
పొందుగ చక్రాంకితమే బుజబలమిదె నాకు
అందిన హరి నీ చింతే ఆత్మబలము నాకు
సందడి పేరు బలము కేశవనామము నాకు
యిందును నందున భవ భయమికలేదిదే నాకు || సకల బలంబులు ||
అందపు తిరుమణులివి పంచాంగ బలమునాకు
సంగతి నీపై పాటలె సర్వ బలిమిదేనాకు
రంగుగ నీ గుణరాసులే రాసి బలమునాకు
యింగితగ నిహపరముల కెదురేదిదేనాకు || సకల బలంబులు ||
కనుకొను నీ విగ్రహమే గ్రహ బలిమిదెనాకు
విను నీ దాసుల సేవె వెనుబలి మిదెనాకు
తనరిన శ్రీ వేంకటపతి దైవబలము నాకు
ఘనమే చెప్పగ నింతట కలిగెబోయిదేనాకు || సకల బలంబులు ||