రాగం : హమీర్ కళ్యాణి
వేవేల చందాల వాడు
వేవేల చందాల వాడు విఠలేశుడు
భావించ నలవిగాని పరమాత్ముడితడు || వేవేల చందాల వాడు ||
సతతము రుక్మిణీ సత్యభామ నడుమ
రతికెక్కిన సింగారరాయడితడు
చతురత సనకాది సంయమీంద్రులమతి
నతిశయిల్లేటి పరమానందమతడు || వేవేల చందాల వాడు ||
దేవతలకెల్లాను దిక్కు దెసై వెలుగొంది
తావుకొన్నయట్టి ఆధారమితుడు
మూవంకగొల్లెతలు మున్ను సేసినతపము
కైవసమై ఫలించిన ఘనభాగ్యమితడు || వేవేల చందాల వాడు ||
వరముతో యశోద వసుదేవాదులకు
పరగిన కన్నుల పండుగితడు
సిరులు మించిన యట్టి శ్రీ వేంకటాద్రిమీది
నిరతి దాసుల పాలి నిధానమితడు || వేవేల చందాల వాడు ||