రాగం – శివరంజని
తాళం – ఆదితాళం
ప|| ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా || ఎన్నడు ||
చ|| పాసిన పాయవు బంధములు
ఆస దేహమున్నాన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు || ఎన్నడు ||
చ|| కొచ్చిన గొఱయవు కోపములు
గచ్చుల గుణములు గలనాళ్ళు
తచ్చిన తలగవు తహతహలు
రచ్చల విషయపు రతునన్నాళ్ళు || ఎన్నడు ||
చ|| ఒకటి కొకటిని ఒడబడవు
అకట శ్రీ వేంకటధిపుడా
సకలము నీ వే శరణంటే యిక
వికటము లణగెను వేడుకన్నాళ్ళు || ఎన్నడు ||
భావము : ఈ సంకీర్తనలో అన్నమయ్య నరుల ప్రతినిధిగా వారిలోని దుర్గుణములు తొలగవలయుననియు, ” భగవంతుని గూర్చి తెలిసి. ఆపై కలిగిన విజ్ఞానమును లోక క్షేమమునకై ఎప్పటికి వినియోగింతురు” అని స్వామిని వేడుచున్నాడు. ఆశలున్నంతవరకు, చిక్కులు తొలగవు. మనసున వేదన యున్నంత వరకు కోరికలుఉ తొలగవు. కపటమున్నంత కాలము కోపము తొలగదు. ఐహిక విషయము లందు ఆసక్తి యున్నంత కాలము ఆందోళనలు తొలగవు. ఐహిక సుఖములందు కోరికకును, భగవదానుభూతికి పొత్తు కుదరదు. ఐహికములు కూడా అంతర్యామి స్వరూపములే యని భావించి స్వామిని శరణందినచో వికారము తొలగి మానవుని సహజస్థితి యగు ఆనందమే ఎల్లప్పుడు నిలుచును.