Tuesday, November 26, 2024

అన్నమయ్య సంకార్తనలు

రాగం – అమృత వర్షిణి
తాళం – ఆదితాళం

ప|| అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకు కలిగె వేంకటేశు మంత్రము || అన్ని ||

చ|| నారదుడు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము || అన్ని ||

చ|| రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె
అంగలించె కృష్ణమంత్ర మర్జనుడు
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
లింగ డమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము || అన్ని ||

చ|| ఇన్ని మంత్రముల కెల్ల యిందిరానాథుడే గురి
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావ కలిగెబో నాకు గురుడియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము || అన్ని ||

- Advertisement -

సకల మంత్రములు వేంకటేశ్వరుని నామములోనే నిండి యున్నవి. అన్నమయ్యకు శైశవముననే వెన్న తినటం అబ్బినట్లుగా శ్రీ వేంకటేశ్వరుని మంత్రము లభించినది. ఇది వెన్న వలె కోమలము, సుకుమారమయినది. నారదుడు నారాయణ మంత్రమును, ప్రహ్లాదుడు నారసింహ, మంత్రమున ఉపాసించిరి. విభీషణుడు రామ మంత్రమును స్వీకరించెను. అన్నమయ్యకు వేంకటేశు మంత్రము లభించినది. ధ్రువుడు వాసుదేవ మంత్రమును, అర్జునుడు కృష్ణ మంత్రమును, శుకుడు విష్ణు మంత్రమును ఉపాసించిరి. వేకంటేశు మంత్రము అన్నమయ్య మహాభాగ్యముగా అతనికి అభించినది. ఇన్ని మంత్రములనకును అధిదైవతము లక్ష్మీపతియే. అన్నమయ్య యొక్క గురుడు, పరమాత్మ అయిన శ్రీ వేంకటపతి మంత్రమును ఆతనికి ప్రసాదించెను. ఇది అతనిని కాపాడునట్టిది. సాధకుడు ఒక మంత్రమును స్థిరముగా విశ్వసిం చ వలెను. భగవంతుడిని ఒక మహనాయ వ్యక్తి రూపముగా నమ్మలేనివాడు ముందుకు పోజాలడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement