ప|| ఇందరికి నభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి || ఇందరికి ||
చ|| వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి || ఇందరికి ||
చ|| తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి || ఇందరికి ||
చ|| పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలపెడి చేయి || ఇందరికి ||
స్వామి వారి చేయి సర్వజీవుల భయమును పోగొట్టి వారిని కాపాడుటలో మిక్కిలి నేర్పుగలది. తేజోమయమైనది.
అమూల్యములగు వేదములను స్వామి మత్య్సావతారమున తన చేతితో ప్రళయమును సాగరము నుండి వెదకి తెచ్చెను. క్షీర సాగరమును చిలుకుచున్నట్టి కవ్వమగు మందరగిరిని కూర్మావతారము న తన మూపు మీదకు తన చేతితో చేర్చెను. వరాహరూపుడై భూదేవిని తన చేతితో ముట్టెపై జేర్చి తన భార్యగా స్వీకరించెను. నరసింహుడై తన చేతివ్రేళ్ళ గోళ్ళ కొనలతో హిరణ్యకశపుని వధిం చెను.
వామనడుగా బలిని మూడడుగులు దానమడుగుచుచ తన చేతిని క్రిందకి చేర్చెను. పరశురామావతారమున దుష్టపాలకుని చంపి భూమిని కశ్యపమహర్షికి తన చేతితో దానమిచ్చెను. రాముడుగా స్వామి తన చేతి బాణముతో సముద్రమును దారికి తెచ్చెను. బలరాముడుగా తన చేతిలో నాగలిని ధరిం చాడు.
బుద్దావతారమున త్రిపురాసురుల వధకై వారి భార్యలను వారి వారి నియమముల నుండి దూరం చేసెను. కల్కిగా స్వామి తన చేతితో గుర్రమును వేగముగా నడపనున్నాడు. తిరుమలపై స్వామి యొక్క చేయి తన చరణములను శరణు పొందుడని సూచిస్తూ వేరొక చేయి అభయం నొసగుచున్నది.