రాగం – హిందోళం
తాళం – ఆది
ప|| అంతయునీవే హరి పుండరీకాక్ష
చెంతనాకు నీవే శ్రీ రఘురామా || అంతయునీవే ||
చ|| కులమును నీవే గోవిందుడా, నా
కలిమియు నీవే కరుణానిధీ,
తలపును నీవే ధరణీధరా, నా
నెలవును నీవే నీరజనాభా || అంతయునీవే ||
చ|| తనువును నీవే దామోదరా, నా
మనికియు నీవే మధుసూదనా
వినికియు నీవే విఠలుడా, నా
వెనక ముందు నీవే విష్ణుదేవుడా || అంతయునీవే ||
చ|| పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్టనడుమ నీవే నారాయణా,
ఇట్టె శ్రీ వేంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి యింక నీవే నీవే || అంతయునీవే ||
భావము : అన్నమయ్య వారి జీవితమున అంతయు స్వామియే. సర్వకాల, సర్వావస్థలలోనూ బంధం, అనుబంధం స్వామి వారితోనే, శరణాగగుతుడైన భక్తునికి సర్వమూ భగవంతుడే.
గోవిందుడుగా నున్న స్వామి కులమే తన కులమని, భక్తవత్సలుడైన స్వామియే తన సంపదయని, భూమిని ధరించిన యట్టి స్వామి యే తన తలపులు, ఆ స్వామియే తనయందు నిలచియున్నాడని అన్నమయ్య భావన.
తామరను తనబొడ్డునందు గల స్వామియే తన శరీరమని, ఆ మధుసూదనుడే తన జీవితమని, తనువినే మాటలు, వినుట అనే శక్తి స్వామియే యని, తన వెనక, ముందు యున్నవారలంతా స్వామి వారే యని తలచారు అన్నమయ్య.
తన జన్మము, చావు పుట్టుకల మధ్య జరిగే జీవితము, స్వామియే తనను కాపాడు అండ. తను బ్రతుకును ముందుకు నడిపే మార్గుము స్వామియే.