మిశ్రవకుళాభరణం
చిన్ని శిశువు చిన్ని శిశువు
యెన్నడూ జాడమమ్మ యిటువంటి శిశువు || చిన్ని ||
తోయంపు కురులతోడ తూగేటిశిరసు చింత
కాయల వంటి జడల గములతోడ
మ్రోయుచున్న కనకవు మువ్వపు పాదాల తోడ
పాయక యశోద వెంట పారాడు శిశువు || చిన్ని ||
ముద్దులు వ్రేళ్ళతోగడ మొరవంక యుంగరాల
నిద్దపు జేతుల పైడి బొద్దులు తోడ
అద్దపు జెక్కల తోడ నప్పలప్ప లనినంత
గద్దించి యశోద మేను కౌగిలించు శిశువు || చిన్ని ||
బలుపైన పొట్టమీద పాల చారలతోడ
నులివేడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై
నిలచి లోకములెల్ల నిలిపిన శిశువు || చిన్ని ||