హరినిన్ను పిలిచీని అదివో అమ్మా
తెరమరుగికనేల తియ్యవమ్మా || హరినిన్ను పిలిచీని ||
చిత్తరు పతిమ వంటి చెలియా నీవు
ఇత్తల ప తికి విడెమీయమ్మా
కొత్తమెరుగు బోలిన కోమలీ నీవు
మొత్తమి కూరిమి పతి మోముజూడవమ్మా|| హరినిన్ను పిలిచీని ||
బంగారు బొమ్మవంటి పడతి నీవు
అంగవించి పతితో మాటాడవమ్మా
అంగజుశరము వంటి అతివె నీకు
నంగతన మదియేల నవ్వవమ్మా || హరినిన్ను పిలిచీని ||
చంచుల చిగురువంటి జవ్వని నీవు
కొంచక శ్రీ వేంకటేశు కూడితివమ్మా
మించి తమ్మిలోని అలమేలు మంగా
ఎంచి ఇద్దరును మమ్ము ఏలరమ్మా || హరినిన్ను పిలిచీని ||