సువ్వి సువ్వి సువ్వని
సుదతులు దంచెదరోలాల || సువ్వి సువ్వి సువ్వని ||
వనితలు మనసులు కుందెన చేసిటు
వలపులు తగనించోలాల
కనుచూపులనెడు రోకండ్లను
కన్నెలు దంచెదరోలాల || సువ్వి సువ్వి సువ్వని ||
బంగరు చెరగుల పట్టుపుట్టములు
కొంగులు తూలగ వోలాల
అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెదరోరాల || సువ్వి సువ్వి సువ్వని ||
ఘల్లు ఘల్లుమను కంకణరవముల
పల్లవ పాణులు వోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు-
లొల్లనె దంచెదరోలాల || సువ్వి సువ్వి సువ్వని ||
కప్పురగంధులు కమ్మని పువ్వుల
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతితేలుచు కోనే –
టప్పని పాడెదరోలాల || సువ్వి సువ్వి సువ్వని ||