రాగం : శుద్ధధన్యాసి
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ || ||వినరో భాగ్యము||
ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణుకథ || ||వినరో భాగ్యము||
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ || ||వినరో భాగ్యము||
గొల్లెతలు చల్లలుగొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
యిల్లిదె శ్రీవేంకటేశ్వరుడు నామము
వెల్లిగొలిపె నీ విష్ణుకథ || ||వినరో భాగ్యము||