Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : లాలనుచు నూచేరు

(”అన్నమాచార్య జీవిత చరిత్ర ” పీఠిక )

లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాల గండవర గోపాల నిను చాల || ||లాలనుచు నూచేరు||

ఉదుటుగుబ్బల సరము లుయ్యాల లూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ
ముదు చెమటల నళికములు తప్పదోగ || ||లాలనుచు నూచేరు||

సొలపు తెలకన్నుగవచూపు లిరువంక
మలయురవళులకు పలుమాఱును బెళంక
కొలది కోవిలగములు క్రోలు మదనాంక
ముల గ్రేణిసేయు రవముల వడి దలంక || ||లాలనుచు నూచేరు||

సరసపదములు జంగచాపుచే పాయ
గురులీల మీగాళ్ళ గుచ్చెళ్ళు రామ
కరమూలముల కాంతి కడుజాయ చేయ
సరస నురు కుసుమ వాసన లెదురు డాయ || ||లాలనుచు నూచేరు||

- Advertisement -

కొలది ననుమేను లతకూన లసియాడ
మెలకువతొ నొకరొకరి మెచ్చి సరిగూడ
తలలూచి చొక్కి చిత్తురుబొమ్మలాడ
అలరి యెల్లరు మోహనాకృతులు చూడ || ||లాలనుచు నూచేరు||

లలిత తాంబూల రసకలితంబు లైన
తళుకుదంతములు కెంపులగుంపులీన
మొలకవెన్నెలడాలు ముసురుకొని తోన
చెలగి సెలవుల ముద్దు చిఱునవ్వులాన || ||లాలనుచు నూచేరు||

మలయమారుత గతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతామి పైపై మెలంగ
బలుగానలహరి యుంపుల రాల్గరంగ
బలసి వినువారి చెవి బడలిక దొలంగ || ||లాలనుచు నూచేరు||

లలనాజనాపాంగ లలితసుమచాప
జలజలోచనదేవ సద్గుణకలాప
తలపు లోపల మెలగు తత్వప్రదీప
భళిర గండవరేశ పరమాత్మరూప || ||లాలనుచు నూచేరు||

Advertisement

తాజా వార్తలు

Advertisement