రాగం : రామక్రియ
భక్తి కొలది వాడే- పరమాత్ముడు
భుక్తి ముక్తి దానె యిచ్చు- భువి పరమాత్ముడు|| భక్తి ||
పట్టిన వారి చే బిడ్డ – పరమాత్ముడు
బట్ట బయటి ధనము – పరమాత్ముడు
పట్టపగటి వెలుగు – పరమాత్ముడు
ఎట్టయెదుటనే వున్నా – డిదే పరమాత్ముడు || భక్తి ||
పచ్చిపాలలోని వెన్న- పరమాత్ముడు
బచ్చెన వాసిన రూపు – పరమాత్ముడు
బచ్చు చేతివొరగల్లు – పరమాత్ముడు
ఇచ్చకొలది వాడు పో- యీ పరమాత్ముడు || భక్తి ||
పలుకులలోని తేట – పరమాత్ముడు
పలియించు నిందరికి – పరమాత్ముడు
బలిమి శ్రీవేంకటాద్రి – పరమాత్ముడు
ఎలమి జీవుల ప్రాణ – మీపరమాత్ముడు || భక్తి ||