పాడరే సోబనాలు పడుతులాలా
వేడుక లిద్దరికిని వెలసె చూడరే || ||పాడరే సోబనాలు||
కొండలే పీటలుగా కూచున్నరెదురుబడి
అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు
వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల
పెండిలాడే రిద్దురును పియిమున చూడరే || ||పాడరే సోబనాలు||
భవనాశి జలముల పాయక తోడనీళ్ళాడిరి
ఇవలా నవలా తాము ఏటిదరుల
జవళి మంచి పూవుల సరిసేసలు వెట్టుచు
తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు || ||పాడరే సోబనాలు||
పొందుగ కనకావతి భోగావతి నదుల
సందడి వసంతముగా చల్లులాడుచు
అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక
చందమున కూడి కూడి సరసము లాడేరు || ||పాడరే సోబనాలు||