నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము || ||నానాటి బతుకు||
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుటకల దీ ప్రపంచము
కట్టకడపటది కైవల్యము || ||నానాటి బతుకు||
కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడు మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాటినపుడే కైవల్యము || ||నానాటి బతుకు||
తెగదు పాపము తీరదు పుణ్యము
నగినగికాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడు డేలిక
గగనము మీదిది కైవల్యము || ||నానాటి బతుకు||