Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : నమో నమో

రాగం : నాటు

నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకర నగజానుతా ||నమో నమో ||

విహిత ధర్మపాలక వీరదశరథ రామ
గహన వాసినీ తాటక మర్దన
అహల్యాశాప విమోచన అసురకుల భంజన
సహజ విశ్వామిత్ర సవనరక్షకా ||నమో నమో ||

హరకోదండ హర సీతాంగనా వల్లభ
ఖరదూషణారి వాలి గర్వాపహా
తరణి తనూజాది తరుచర పాలక
శరధి లంఘన కృత సౌమిత్రి సమేత ||నమో నమో ||

బిరుద రావణ శిరోభేదక విభీషణ
వరద సాకేతపురివాస రాఘవ
నిరపమ శ్రీవేంకట నిలయ విజయనగర
పుర విహార పుండరీకాక్షా ||నమో నమో ||

Advertisement

తాజా వార్తలు

Advertisement