రాగం : కళ్యాణి
తగునయ్య హరి నీకు దానము దెచ్చుకొనిన
జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి || తగునయ్య ||
కిమ్ముల శిశుపాలుని గెలిచి చేకొంటివిగ
సమ్మతించు రుక్మిణి జయలక్ష్మి
అమ్ముమొనను జలధినడచి లంక సాధించి
కమ్మరచేకొన్న సీతే ఘన వీరలక్ష్మి || తగునయ్య ||
నరకాసురు నడిచి నవ్వుతా చేయివేసితివి
సరిగా సత్యభామె పో సంగ్రామలక్ష్మి
హిరణ్యకసిపుగొట్టి యింద్రాదులకు నీచే
వరమిప్పించిన యాకే వరలక్ష్మి || తగునయ్య ||
నిండిన వురము మీద నిఖిల సంపదలతో
అండనుండే యాకే పో ఆదిలక్ష్మి
మెండగు శ్రీవేంకటాద్రి మీద నీ సరుస నేగే
గండుమీరే కళలతో కళ్యాణలక్ష్మి || తగునయ్య ||