రాగం : చక్రవాకం
ఛీ ఛీ నరులదేటి జీవనము
కాచుక శ్రీహరి నీవె కరుణింతుగాక || ఛీ ఛీ ||
అడవిలో మృగజాతియైనా గావచ్చుగాక
పడి నితరుల గొలువగ వచ్చునా
వుడిలోని పక్షియై వుండనైనా వచ్చుగాక
విడువకెవ్వరినైనా వేడవచ్చునా || ఛీ ఛీ ||
పసురమై వెతలేని పాటు పడవచ్చు గాక
కసటువో నొరుల బొగడగా వచ్చును
వుసురు మానై పుట్టివుండనైన వచ్చుగాక
విసువక వీరివారి వేసరించవచ్చునా || ఛీ ఛీ ||
యెమ్మెల బుణ్యాల సేసి యిల యేలవచ్చుగాక
కమ్మి హరిదాసుడు గావచ్చునా
నెమ్మది శ్రీవేంకటేశ నీచిత్తమే కాక
దొమ్ముల కర్మములివి తోయవచ్చునా || ఛీ ఛీ ||