ప|| చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు || చేరి ||
చ|| సొలసి చూచినను సూర్యచంద్రులను
లలివెదచల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు || చేరి ||
చ|| మాటలాడినను మరి యజాండములు
కోటులు వొడమేటి గుణరాశి
నీటగు నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరేటి సముద్ర మితడు || చేరి ||
చ|| ముంగిట పొలసిన మోహన మాత్మల
పొంగించే ఘనపురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు
నంగము శ్రీ వేంకటాధిపు డితడు || చేరి ||