అలమేలుమంగ నీ వభినవ రూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా ||
గరుడాచలధీశు ఘనపక్షమున నుండి
పరమానంద సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించగ జేసితి గదమ్మా ||
శశికిరణములకు చలువల చూపులు
విశదముగా మీద వెదచల్లుచు
రసికతపెంపున కరగించి యెప్పుడు నీ
వశము చేసుకొంటి వల్లభు నోయమ్మా ||
రట్టడి శ్రీ వేంకట రాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టి మాకు లిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని వురమున సతమైతినమ్మా ||