రాగం : శుద్ధసావేరి
ప|| అనియానతిచ్చె కృష్ణుడర్జునునితో
విని యాతని భజించు వివేకమా ||
చ|| భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల
దీమసాన మోచేటి దేవుడ నేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడ నేను ||
చ|| దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
తీపుల నరగించేటి దేవుడ నేను
ఏపున నిందరిలోని హృదయములోన నుందు
దీపింతు తలపు మరపై దేవుడ నేను ||
చ|| వేదము లన్నటిచేత వేదంతవేత్తలచే
ఆది నే నెరగతగిన ఆ దేవుడను
శ్రీదేవితో గూడి శ్రీ వేంకటాద్రి మీద
పాదైన దేవుడను భావించ నేను ||