Saturday, November 23, 2024

అంగదుడిది సుగ్రీవుడి మీద తిరుగుబాటా

సీతాదేవిని వెతకడానికి వెళ్ళిన వానరులు భూమండలం అంతా వెతికి నెల గడువు తీరగానే తిరిగి వెనక్కు వచ్చారు. తూర్పు దిక్కుకు పోయిన వినతుడు, ఉత్తర దిక్కుకు పోయిన శత వలి, పశ్చిమ దిక్కుకు పోయిన సుషేణుడు నెలకాగానే మరలి వచ్చి ఎక్కడా సీత కనబడలేదనీ, సీత జాడలేదనీ చెప్పారు.
ఇక హనుమంతుడు సీతాదేవిని తప్పక చూసే వస్తాడని ఆయ న రాకకొరకై అందరూ వేచి చూస్తున్నారు. హనుమంతుడు సుగ్రీ వుడు సూచనమేరకు, అంగదుడితో, తారుడితో, ఇతరులతో కలిసి మొదలు వింధ్య పర్వతం దగ్గరకు వెళ్ళాడు. సీతాదేవి కొరకు అంత టా వెతికారు. సీత ఎక్కడా కనబడలేదు. వ్యసనపడుతూ ఒక చెట్టు కింద చేరి వుండడం చూసిన అంగదుడు, తానూ బడలికతో ఉన్న ప్పటికీ, తనలాగే శ్రమపడిన వానరులను ఉత్సాహపరిచే మాటలు చెప్పాడు. మళ్లిమళ్లి వెతుకుదాం అన్నాడు. అంగదుడి మాటలు విన్నవారంతా బడలిక తీరగానే మళ్లి వింధ్య పర్వతం నాలుగు దిక్కులా వెతకసాగారు. అలా వెతుకుతుంటే ఋక్షబిలం అనే పేరు కల ఒక పెద్ద బిలాన్ని చూశారు వానరులు.
అప్పుడు ఆంజనేయుడు అక్కడ నీళ్లున్న బావో, మడుగో వుండడం నిజం కాబట్టి లోపలికి వెళదామన్నాడు. అంతా బిలం లోకి ప్రవేశించి, ఆమడ దూరం దప్పికతో ప్రయాణం చేసిన తరువాత, వెలుతురున్న ఒక ప్రదేశాన్ని, తినుబండారాలను చూశా రు. వారంతా అలాఅలా వెతుకుతుంటే ఒకచోట నార చీరెలు, కృష్ణా జినం వస్త్రంగా ధరించి తపస్సుచేస్తున్న స్త్రీ కనిపించింది.
హనుమంతుడు ఆ ముసలిదాని దగ్గరికి వెళ్ళి, తమ ఆకలి దప్పుల విషయం చెప్పి, అక్కడున్న భోజన పదార్థాలు, పండ్లు, ఫలాలు, పుష్పాలు, పరిమళాల బంగారు చెట్లు, నిర్మల జలా లు, బంగారు కమలాలు, ఎవరి తపోమహిమ వల్ల కలిగాయని అడి గాడు. ఆమె గురించి, ఆమె మ#హమ గురించి ప్రశ్నించాడు. జవా బుగా స్వయంప్రభ అనే ఆమె ఇలా చెప్పింది.
”మాయలు కల రాక్షస ప్రభువైన మయుడు తన అద్భుతశక్తి తో దీన్ని నిర్మించాడు. ఈ బంగారు గృహాన్ని రాక్షసులకు విశ్వకర్మ అయిన దనుజశ్రేష్టుడు నిర్మించాడు. అతడు ఈ మనోహరమైన వనాన్ని కల్పించి ఇక్కడ వుండసాగాడు. దానవుడై న మయుడు దేవతాస్త్రీ అయిన హమతో కలిసి వున్నందుకు కోపగించిన ఇం ద్రుడు వజ్రధారతో అతడిని చంపాడు. ఆ మయుడు హిమకు ఈ బంగారు గృహాన్ని, వనాన్ని ఇచ్చాడు. ఇక్కడ సమస్త సుఖాలున్నా యి. ఆటపాటల్లో నేర్పరైన హిమకు నేను ప్రేమ పాత్రమైన సఖిని. ఆమెదే యీ వనం. ఆమెవల్ల నేను దీన్ని వరంగా పొంది దీన్ని రక్షిస్తున్నాను. నేను మెరుసావర్ణి కూతురును. నా పేరు స్వయం ప్రభ. ఈ ఫలాలు, పదార్థాలు, పానీయాలు తృప్తి తీరా తినండి, తాగండి. శ్రమ తీరిన తరువాత మీ వృత్తాంతం చెప్పండి.”
హనుమంతుడు తమ చరిత్ర సమస్తం ఆమెకు వివరించాడు. తామొచ్చిన పని గురించీ చెప్పాడు. ఆమె ఇచ్చిన ఫల మూలాలు తిని బడలిక తీర్చుకుని, తమను ఈ బిలం నుండి భూమ్మీదకు చేర్చ మన్నాడు. తన తప:ఫల బలంతో వానరులందరినీ నిమిషంలో బిలం నుండి దాటించింది ఆమె. వింధ్యపర్వతం దగ్గర ప్రస్రవణం అనే పెద్ద కొండ దగ్గర దింపి స్వయంప్రభ వెళ్లిపోయింది. స్వయం ప్రభ సర్వజ్ఞ అని అనుకోవాలి. ఆ కారణాన ఆమెకు భూత భవిష్యత్‌ వర్తమానాలలో ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఎక్కడ వాళ్ల ను వదిలితే భవిష్యత్‌ కార్యం నెరవేరుతుందో అక్కడే, సముద్ర తీరంలో విడిచిందని అర్థం చేసుకోవాలి. అప్పుడు అంగదుడు వానరులతో ఇలా అన్నాడు. ”మీరంతా రాజుకు విశ్వాసపాత్రులైన సేవకులు. రాజాజ్ఞ ప్రకారం, రామకార్యం నెరవేర్చడానికి, నామీద ప్రేమతో నన్ను ముందుండే వాడిగా చేశారు. ముఖ్యుడిగా వుండడా నికి నేను అంగీకరించి మీవెంట వచ్చాను. పని చేయకుండా మరలి పోతే సుగ్రీవుడు మనల్ని తునకలు- తునకలుగా నరుకుతాడు.
ఇందులో సందేహం లేదు. నియమించిన గడువు కాలం దాటిపోయింది. మనం బాధపడి చేయగలింది ఏమీలేదు. కాబట్టి మనకిప్పుడు ప్రాయోపవేశం ఒక్కటే మార్గం అని తోస్తున్నది.”
”సుగ్రీవుడు స్వభావ సిద్ధంగా క్రూరుడు. దానికితోడు ఇప్పు డాయన రాజు. అధికార బలం వచ్చింది. సీత వార్త చెప్పకపోతే మనల్ని చంపుతాడు కాని క్షమించడు. కాబట్టి అక్కడికి పోయి అవమానపడి చావడం కంటే ఇక్కడే చావడం మంచిది. నాకు ¸°వరాజ్యం ఇచ్చినవాడు సుగ్రీవుడు కాదు. రామభద్రుడు. ఆయన ఆజ్ఞ మీరలేక తనకిష్టం లేకున్నా నన్ను యువరాజు చేశాడు. నామీద సద్గుణ భద్రుడైన రామభద్రుడికి దయ వున్నది కాబట్టి నన్నప్పుడు ఏమీ చేయలేక వూరకున్నాడు. ఇప్పుడు సమయం దొరికింది. కాబట్టి ఆయన ఆజ్ఞ మీరానన్న నెపంతో నన్ను చంపు తాడు. అక్కడికి పోయి చావడంకంటే పుణ్యస్థలమైన ఈ సముద్ర తీరంలో చావడం మేలు” అంగదుడిలా చెప్పడంతో భయపడుతు న్న వానరులను చూసి తారుడు ఇలా అన్నాడు.
”మీరెందుకు దు:ఖపడతారు. చావాల్సిన పనిలేదు. మన మంతా ఈ బిలంలో మళ్లి ప్రవేశించుదాం. మనకు కావాల్సిన చెట్లు, తినడానికి భోజ్యాలు, కందమూలఫలాలు, పరిశుద్ధమైన వనం, పరిశుద్ధమైన నీరు అక్కడ వున్నాయి. అవే కదా మనకు కావా ల్సింది. భయం మాట కూడా అక్కడ వినపడదు. అక్కడ మన ముంటే సుగ్రీవుడే కాదు, రామచంద్రుడైనా మనల్ని చేరలేడు”.
అంగదుడు చెప్పిన మాటలకు అనుకూలంగా తారుడు చెప్పి న మాట విన్న వానరులందరూ ఎలాచేస్తే మనకు కీడు కలగదో అలాగే చేద్దామని అన్నారు. ఇదంతా గమనించిన హనుమంతు డు, సుగ్రీవుడి రాజ్యాన్ని అంగదుడు హరించాడని భావించాడు. అంటే వారందరూ బిలంలోకి ప్రవేశించి అక్కడో, బయట అడవుల లోనో వానర రాజ్యం ఒకటి ఏర్పరుచుకుంటారు. అప్పుడు ఏకంగా వున్న వానర రాజ్యంలో ద్వైవిధ్యం పుటుతుంది. సుగ్రీవుడి రాజ్యం చెడి పోతుంది. వాలి పక్షపాతులు ఇక్కడికి చేరుతారు. అదలా వుండగా ప్రారంభించిన రామకార్యం చెడిపోతుంది. ఈవిధంగా ఆలోచించి హనుమంతుడు. అంగదుడితో ”ఏమి అంగదా! నువ్వీ వానరుల తో ప్రత్యేక వానరరాజ్యం స్థాపించాలని ఉపాయంతో వున్నావా? వీరంతా రామకార్యం కొరకు నీ వెంట వచ్చారు కాని నీతోపాటు కల కాలం ఇక్కడ తమ ఇండ్లు- వాకిళ్లు, భార్య- బిడ్డలను వదిలి ఈ అడవిలో అల్లాడడానికి వచ్చారని అనుకుంటున్నావా? నేనిప్పుడే పోయి రామలక్ష్మణులను, సుగ్రీవుడిని, తక్కిన సైన్యాన్ని ఇక్కడికి పిలుచుకొస్తాను. మీరు చేయబోయేది రాజద్రోహం. కాబట్టి ఇప్పు డు దండం తప్పవచ్చు కాని అప్పుడు దండం తప్పదు. అప్పుడు నువ్వు, నీ రాజ్యం ఏం కాబోతున్నదో ఆలోచించు” అని కోపంగా చెప్పి మళ్లి శాంతంగా- ”అంగదా! నువ్వు యుద్ధంలో నీ తండ్రి కంటే నేర్పుకలవాడి వి. అయినా ఒక్కటి ఆలోచించు. ఈ కోతులు ఎప్పటికీ చపల చితు ్తలే. ఇప్పుడున్న బుద్ధి ఇంకాసేపటికి వుండదు. ఇలాంటి వీళ్లు తమ పెళ్లాలను, పిల్లలను, బంధువులను వదిలి కల కాలం ఇక్కడ నిన్నెందుకు కొలుస్తారు. ఇక్కడ వున్నవారంతా నీకు లోబడి వుంటారని అనుకుంటున్నావేమో? అది పొరపాటు. సుగ్రీ వుడిని సుహోత్రుడు, నీలుడు, జాంబవంతుడు ఎలా వదలరో అలాగే నేనూ వదల ను. నువ్విక్కడ నీ ప్రయత్నం మొదలుపెట్టగానే మేం సుగ్రీవుడి దగ్గరికి పోయి అంగదుడు ఇలా చేస్తున్నాడని చెప్పే వాళ్ళమే. ఇక్కడ నీ సేనకంటే అక్కడ సుగ్రీవుడి సేన ఎక్కువని తెలుసుకో. బలవంతుడితో విభేదించి బల#హనుడు బతకగలడా?”
”వానరులను నమ్మి నువ్వు పినతండ్రితో పగబూనినా, వీరు చివరిదాకా నీతో వుండరు. నువ్వొక్కడివే మిగులుతావు. సుఖజీవ నానికి, సుఖ శయ్యలకు, బంధువుల తోడుకు, అలవాటుపడ్డవారు ఈ ఘోరారణ్యాలలో నీకోసం ఎందుకు కష్టపడతారు? నీ మేలు గోరు బంధువులు, నీ స్నేహితులు, నిన్ను వదిలిపోగా నువ్వు ఒంటరివాడివై ఏ సమయంలో ఏమవుతుందో అని భయపడతావు. ఉత్త భయం మాత్రమేకాదు. నీకు కీడుకూడా కలుగుతుంది. నీ విరో ధ బుద్ధి మానుకుని వినయంగా మా వెంట కిష్కింధకురా. ఇదివర కులాగే నిన్ను నీ పినతండ్రి యువరాజుగా నియమిస్తాడు. నీమీద ఆయనకు ఎలాంటి ద్వేషం లేదు. ప్రతిజ్ఞ తప్పనివాడు. నా మాట నమ్ము. నీకెప్పుడూ సుగ్రీవుడు కీడు చేయడు. కాబట్టి యువరాజా! కిష్కింధకు పోదాం”. హనుమంతుడిలా సుగ్రీవుడిని ప్రశంసించి చెప్పగా అంగదుడు ”తనపని చక్కపరిచి ప్రాణం కాపాడిన రామ చంద్రుడినే మరచిపోయినవాడు మరింకెవరి మేలుకోరగలడు? ఇలాంటి వాడు ధర్మమార్గంలో నడుస్తాడా? ఈవిధమైన చపల చిత్తుడుని, స్మృతిలేనివాడిని, పాపాత్ముడుని, కృతఘ్నుడుని సద్వం శంలో పుట్టి గౌరవంగా బతకాలనుకున్నవాడెవరూ నమ్మరు. ఆయన తన కొడుకుకు రాజ్యం ఇస్తాడు కాని విరోధి కొడుకైన నన్ను ప్రాణాలతో కూడా వుండనిస్తాడా? కాబట్టి నేను బతికితే రాజ్యం ఆశిస్తాడని నన్ను చంపుతాడు. నా మనసులో వున్న ఆలోచనంతా చెప్పాను. ఈ కారణాన నేను స్పష్టంగా అపరాధం చేసినట్లే. దీనుడి ని. నా రక్షణలో శక్తిలేనివాడిని. కాబట్టి నేను జీవించి దిక్కులేనివాడి లాగా కిష్కింధలో ఎలా వుండగలను? ప్రాణం తీపి కదా? అక్కడికి వచ్చి చెరసాలలో పడి చావడంకంటే ఇక్కడ ప్రాయోపవేశం చేయ డం మేలు” అని చెప్పి తోటి వానరులతో, ”వానరు లారా! మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీమీ ఇండ్లకు వెళ్ళవచ్చు. ఆజ్ఞ ఇస్తున్నాను. నేను కిష్కింధకు రాను. నేను ఎలా జీవించి వుండగలను?” అంటూ, దర్భలు పరచి, వాటిమీద తూర్పు ముఖంగా కూర్చుని మరణమే మేలని నిశ్చయించుకున్నారు. రామచంద్రుడితో సహా అందరినీ తలచుకుంటూ, జటాయువు పేరెత్తాడు. ఏ ప్రదేశంలోనైతే వానరు లు చావాలని నిర్ణయించారో, అక్కడే, జటాయువు కన్నా దీర్ఘకాలం జీవించివున్నవాడు, గద్దలకు రాజు, పర్వత గుహలో వున్నవాడు, సంపాతి బయటకు వచ్చి, వానరులందరినీ సంతోషంగా చూశా డు. ఆయన రాకతో అంగదుడి కథ ఒక మలుపు తిరిగింది.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement