Sunday, December 22, 2024

దూతల సలహాలు వినని రావణుడు..

శ్రీరామచంద్రమూర్తి తనకు శుభ శకునాలు కలగడం చూసి సంతోషించి, లక్ష్మణుడిని కౌగలించుకుని, ”లక్ష్మణా! నాకు అన్నీ శుభ శకునాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రావణ పాలిత లంకా నగరాన్ని ఇప్పుడే ముట్టడిద్దాం” అంటూ విల్లు ధరించి లంకకు అభిముఖంగా అడుగులేసాడు. రాముడు వెంట సుగ్రీవ, విభీషణులు, ఇతర వానరు లు బయలుదేరారు. లంకను చూసిన రాముడు ”పాపాత్ముడైన రావణుడి చెరలో సీత మనో వేదనతో దీనురాలై దు:ఖపడుతున్నది కదా!” అనుకున్నాడు. ఆ తరువాత రాజనీతిశాస్త్రం ప్రకారం సేనలను విభ జించాడు. నీలుడు అతడి సేనతో అంగదుడు హృదయ స్థానంలో వుండేట్లు, ఋషభుడు తన సేనతో కుడిపక్క వుండే విధంగా, గంధమాదనుడు ఎడమ వైపు, వేగదర్శి, సుసేషణుడు, జాంబవంతుడు వారి వారి సేనలతో గర్భం కాపాడేట్లు ఆజ్ఞచేసి, తానూ లక్ష్మ ణుడితో కలిసి శిరోదేశంలో నిలిచాడు. పడమటి భాగాన్ని వరుణుడు, సేన పుచ్ఛ భాగాన్ని సుగ్రీవుడు రక్షించేట్లు వ్యూహంపన్నాడు శ్రీరాముడు.
శ్రీరాముడు వానర సైన్యంతో సముద్రం ఒడ్డున వున్న సంగ తి రావణుడి వేగులవాడు శార్దూలుడు కనిపెట్టాడు. సుగ్రీవుడి సేనను చూసి వేగంగా రావణుడి దగ్గరికి వెళ్ళి ”వానరుల, ఎలుగుబంట్ల సేన లంకా పట్టణం మీద పడడానికి వచ్చిందనీ, ఆ సేన పరిమాణం సముద్రంలా పదియోజనాల నేల ఆక్రమిం చి వుందనీ, రామలక్ష్మణులు సీతాదేవి దగ్గరికి రావడానికి సమీ పంలోనే సముద్రం ఒడ్డున వున్నారనీ, వారి సమాచారం వివ రంగా సర్వం తెలుసుకోవడానికి దూతలను పంపమనీ, ఈ సమయంలో సామమో, దానమో, భేదమో అవలంబించడం మంచిద”నీ చెప్పడంతో రావణుడు ఆలోచించాడు.
రావణుడు శుకుడుని పిలిచి, వెళ్ళి సుగ్రీవుడికి తన మాట లుగా ఈవిధంగా చెప్పమన్నాడు. ”సుగ్రీవా! నాతో నిష్కారణ కలహం నీకు ధర్మం కాదు. నువ్వు, నేనూ ఇద్దరం బ్రహ్మ మను మలం. కాబట్టి మనకు బంధుత్వం వుంది. అల్పుడైన రాముడి తో నీకేం పని? రాముడితో స్నేహం చేయడంవల్ల నీకు కలిగే లాభం లేదు. రాముడి భార్యను నేను అపహరిస్తే నీకు కలిగే నష్టం ఏమిటి? మనకు విరోధం ఎందుకు? నువ్వు లేకపోతే, సముద్రా న్ని దాటి వానరులు ఇక్కడికి రాలేరు. ఇది నువ్వు ఆలోచించు.”
రాక్షసరాజు ఆజ్ఞానుసారం శుకుడు చిలుకలాగా ఆకాశ మార్గాన పోయి, నేల దిగకుండా అక్కడినించే రావణుడు చెప్పి న మాటలను యథాతథంగా సుగ్రీవుడికి చెప్పాడు. ఆ మాటల కు వానరులు కోపించి, ఆకాశానికి ఎగిరిపోయి వాడిని పట్టుకు ని, విసిరి నేలపైకి కొట్టారు. నేలమీద పడిన శుకుడు కలవరపడి, ”రామచంద్రా! నేను దూతను కాబట్టి నన్ను చంపకూడదు. వీరు నన్ను చంపుతున్నారు. వారిని నివారించు” అని రాముడిని ఉద్దేశించి అన్నాడు. వాడి మొర విన్న రామచంద్రమూర్తి, ఆద రంతో వాడిని చంపవద్దని చెప్పడంతో చంపకుండా చెరలో వేశారు. వానరులు ఆవలి ఒడ్డుకు చేరిన తరువాతే వదిలారు.
సుగ్రీవుడు ఆ దూతను చూసి ”రావణుడితో ఇలా చెప్పు. ఎప్పుడూ నీకూ, నాకూ స్నేహభావం లేదు. రామచంద్రమూర్తి నాతో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని చంపి నాకు ఉపకా రం చేశాడు. ఆయన నీకు పగవాడు. నేనేమో ఆయన మేలు కోరే వాడిని. కాబట్టి నువ్వు నాకూ పగవాడివే. వాలి నాకు పగవాడు కాబట్టి చంపించాను. నిన్నూ అలాగే చంపిస్తాను. నువ్వు పాతా ళంలో దాక్కున్నా, సీతాపతి యుద్ధంలో నీ తల నేలకూలుస్తా డు. ఇంద్రాదులకు కూడా జయించనలవి కాని రాముని సామా న్యుడని భావించావా? ఆయన నీ పాలిటి మృత్యువు” అన్నాడు.
సుగ్రీవుడు శుకుడిని వదిలాడు. శుడుకు భయం-భయం గా రావణుడిని సమీపించాడు. తనకు జరిగిన పరాభవం చెప్పా డు. శ్రీరాముడు రక్షించకపొతే తనను చంపేవారని కూడా చెప్పా డు. ”రామచంద్రమూర్తి సుగ్రీవుడితో కలిసి సీతాదేవి సమీపా నికి రానే వచ్చాడు. అదిగో అక్కడే వున్నాడు. రామచంద్రమూర్తి సముద్రం నీళ్ళలో సేతువు కట్టాడు. సముద్రం దాటి, దక్షిణ తీరంలో సేనలతో వచ్చి లంకను ముట్టడిచేశాడు. రాక్షసులను చంపడానికి విల్లు చేతపట్టి సిద్ధంగా వున్నాడు. వానరులు లంక కోటలపైకి ఎక్కకముందే సీతను ఇవ్వడమో, యుద్ధం చేయడ మో నిర్ణయించు” అన్నాడు. ఆ మాటలకు కోపం వచ్చింది రావ ణుడికి. దేవదానవులు గుంపుగా ఒక్కటై తన్నెదిరించినా సీతను ఇచ్చేది లేదన్నాడు. ఇంద్రుడు వచ్చినా, వరుణుడు వచ్చినా, యముడే వచ్చినా తనకే కీడు చేయలేరని అన్నాడు.
తరువాత శుక సారణులు అనే మంత్రులను చూసి, సముద్రం ఎక్కడ? దానిమీద సేతువు కట్టడం ఏమిటి? సేతు నిర్మాణం నిజమా? మారువేషాలు వేసుకుని ఎవరూ చూడకుం డా వానరసేనలోకి వెళ్ళి వానరుల శక్తి? రాముడి, సుగ్రీవుడి మంత్రులెవరు? వానర సేనానాయకుడు ఎవరు? లాంటి వివ రాలన్నీ తెలుసుకుని రమ్మన్నాడు. రావణుడి ఆజ్ఞానుసారం శుక సారణులు వానరుల వేషాల్లో వెళ్ళారు. అక్కడ వానరసేన చూసి భయపడ్డారు. లెక్కపెట్టడానికి వశం కాని వానర సేన. రావణుడు ఎవరినైనా వేగులవారిని పంపుతాడని అనుమా నించి, వారిని కనిపెట్టాలని తిరుగుతున్న విభీషణుడు, శుకసార ణులను పట్టుకుని, రాముడి ఎదుట నిలబెట్టాడు. శుకసారణు లు రావణుడి ఆజ్ఞానుసారం వానరసేన పరిమాణాన్ని తెలు సుకునేందుకు వచ్చామని చెప్పారు. ఇది తాము చేసిన దోష మని, అందుకుగాను తమను చంపదల్చుకుంటే చంపవచ్చని అంటారు. శత్రువు, మిత్రుడు అన్న భేదం లేకుండా అందరి మేలు కోరే శ్రీరాముడు చిరునవ్వుతో-
”మీరు సమస్త సైన్యాన్ని చూసి వుంటే, వెళ్లి పొండి. విభీషణుడితో వారిని వదలమని చెప్పా డు. శుకసారణుల కట్లు విప్పించాడు. వారు రాముని ”జయ జయ రామచంద్రా” అని పొగి డారు. రావణుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు.
”రాజా! భయంకర తేజంకల ఆ గొప్ప పరా క్రమవంతుడి గురించి మేమేమని చెప్పగలం? దిక్పాలకులతో సమానమైన నలుగురు బలశా లులు రామలక్ష్మణ, సుగ్రీవ, విభీషణులు ఒక్క చోట చేరారు. ఒక్క శ్రీరాముడే లంకను పొడి చేయగలడు. వానరసేనను మనుష్యులు, రాక్ష సులేకాదు దేవతలు, ఇంద్రుడితోసహా జయిం చ లేరు. వానరసైన్యంతో యుద్ధం తగదు. రాము డికి సీతను ఇవ్వడమే సరైనపని.” అన్నారు.
జవాబుగా రావణుడు దేవదానవులు కలి సి ఒక్కటిగా వచ్చినా, లోకాలన్నీ కలిసి వచ్చి తన్ను చంపుతామన్నా, సీతను ఇవ్వనన్నాడు. ఇలా అంటూ, ఆకాశాన్ని అంటుతున్న తన ప్రాసాదాన్ని ఎక్కా డు. అక్కడ నుండి కొండల్లో, అడవుల్లో, సముద్రంలో, వానరు లతో నిండిన ప్రదేశాన్ని, అంతంలేని, లెక్కలేని, వానరసేనను చూసి సారణుడితో వానర వీరుల వివరాలు చెప్పమని అడిగా డు. ఆ విషయాలు తెలిసిన సారణుడు రావణుడితో ఒక్కొక్క వానర వీరుల బలపరాక్రమాల గురిం,చి వివరించాడు. రామ లక్ష్మణుల గురించి, వారి వీరత్వం గురించీ వివరించాడు.
”రాక్షసరాజా! ఇక వానరసేన సమాఖ్య చెప్తా విను. వేయి కోట్లు, నూరు శంఖాలు, వేయి మహాశంఖాలు, నూరు బృందా లు, ఒక మహాబృందం, వేయి నూర్ల పద్మాలు, వేయి మహాప ద్మాలు, నూరు ఖర్వాలు, నూరు సముద్రాలు, నూరు మహౌఘాలు, పదివేల మహౌఘాలు కలిగి పెద్ద సముద్రంలాగా వున్న కపిసేనతో విభీషణుడు తనకు తోడుండగా, మంత్రులతో కలిసి సుగ్రీవుడు నీతో యుద్ధానికి సన్నద్ధంగా వున్నాడు. దేవరా! సుగ్రీ వుడు మిక్కిలి బలశాలి. వానర సేనను గుర్తించి, ఎలా చేస్తే ఓడి పోకుండా గెలుస్తావో అలాంటి ప్రయత్నం చేయి” అన్నాడు.
శుకుడు ఈవిధంగా చెప్పగా రావణుని గుండె భయంతో ఝల్లుమంది. అది బయటపడకుండా కోపం తెచ్చుకుని, శుక సారణులను చూసి, ”అప్రియమైన మాటలు చెప్పవచ్చునా? మీతెలివితేటలు బూడిదైపోయాయా?” అని నిందించాడు.
ఆ తరువాత శార్దూలాదులను పంపాడు. వారు మారు వేషాలు వేసుకుని, సముద్ర తీరానికి చేరారు. అక్కడ వానర సైన్యాన్ని చూసి భయపడిపోయారు. విభీషణుడు వారిని వేగు లుగా గుర్తించి, శార్దూలిడిని పట్టుకుని కొడుతుంటే వాడి ఏడుపు విని రాముడు దయతో వాడిని విడవమని చెప్పాడు. తిరిగి వెన క్కు వచ్చి కపుల చేతుల్లో తాను పడ్డ బాధలు, కపుల పరాక్రమం గురించి చెప్పాడు. వాళ్ళను యుద్ధంలో గెలవడం అసాధ్య మనీ, సీతను అప్పగించడమే మేలనీ అన్నాడు. సీతాదేవిని అప్ప గించే సమస్యే లేదని, యుద్ధానికి సిద్ధం అన్నాడు రావణుడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement