అచ్చంపేట: – దక్షిణాది అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర నేడు ప్రారంభమైంది. ఈ జాతర మూడురోజులపాటు సాగనున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరించడం విశేషం. ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించు కోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కి.మీ. మేర నడక మార్గాన వెళ్లి స్వామిని దర్శించు కుంటారు. అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు. దర్శనానికి వెళ్లేముందు ‘వస్తున్నాం లింగమయ్యా’.. అని, తిరిగి వెళ్లే సమయంలో ‘వెళ్లొస్తాం లింగమయ్యా’.. అంటూ దారి పొడవునా నామస్మరణ మార్మోగనున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ యాత్ర చేసిన వారు ఇక్కడి అందాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు.

దారి పొడవునా అపురూప దృశ్యాలే..
నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తయిన కొండలు.. లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. చెంచులే పూజారులుగా జరిపే నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లోని సలేశ్వరం ఉత్సవాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి.
నల్లమల కొండపై నుంచి జాలువారే జలపాతాలు.. పచ్చదనంతో నిండిన కొండలు.. కోనలు.. లోయలు.. గుహలు.. ఎటుచూసినా ప్రకృతి రమణీయతే.. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువుదీరడం నల్లమల వాసుల పుణ్యమని చెప్పొచ్చు. చెంచుల కులదైవం లింగమయ్య (పరమశివుడు) దర్శనం పూర్వజన్మ సుకృతం.. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దారిపొడవునా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దాతలు ఉచిత అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలు, వసతి ఏర్పాటు చేస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు స్వామి దర్శనానికి వస్తుంటారు.
సలేశ్వరం చేరుకోండిలా..
శ్రీశైలం-హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్లాలి. 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. పది కిలోమీటర్ల దూరం వెళ్లగా నే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. అయితే, లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దతేరును భక్తులు దర్శించుకొని లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా.. అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు భారీ సంఖ్య లో తరలివెళ్తారు. ఫరహాబాద్ నుంచి వెళ్లే భక్తులు నిజాం విడిది నుంచి ఎడమవైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వ రం బేస్‌క్యాంపు వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపెంట వద్ద వా హనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. రాంపూర్ చెంచు పెంట నుంచి సలేశ్వరం వరకు భక్తులకు దాతలు తాగునీటిని ఏర్పా టు చేయనున్నారు. ఈ చెంచు పెంట దాటిన అనంతరం వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
మోకాల చెర్వు, గాడిదదొన్న కాల్వ వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మైసమ్మకట్ట, పాపనాశనం, లోయప్రాంతం, భైరవుడి గుడి, లోయలోకి ముందుకు దిగితే శంకుతీర్థం, సలేశ్వర తీర్థం గుండాలు వస్తాయి. నడక దారిలో 250 అడుగుల నుంచి 400 అడుగుల ఎత్తు ఉండే రెండు సమాంతర గుట్టలు.. వాటి మ ధ్యలో లోతైన లోయలోకి జలధార పడుతుంది. తూర్పు గుట్టకు స మాంతరంగా అర కిలోమీటర్ దిగి తరువాత దక్షిణం వైపునకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైన కిలోమీటర్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకున్న తరువాత మళ్లీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మ ధ్య లోయలోకి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరం ఉండగానే.. లోయ అడు గు భాగానికి చేరుకుంటాం. గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంట రెండు గుట్టల మధ్య ఇరుకైన లోయ ఉంటుంది. ఇక్కడ చా లా జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారి మాత్రమే ఉంటుం ది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని.. భక్తులు నీటిని తీసుకెళ్తుంటారు. గుండం ఒడ్డు వైపు తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్యస్వామి కొలువుదీరాడు. కింది గుహలో కూడా లింగం ఉంటుంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.
ప్రత్యేక బస్సులు..
సలేశ్వ రం క్షేత్రానికి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుండగా, చివరి బస్సు సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెంటకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో సలేశ్వరం వెళ్లవచ్చు.