- అన్ని క్యూ లైన్లూ కిటకిట
- విఐపి సిఫార్సు దర్శనాలు 3గంటలు రద్దు..
- రూ 500 టికెట్లు నిలిపివేత
- అంతరాలయంలో సామాన్యులకే పెద్దపీట..
ఆంధ్రప్రభ విజయవాడ : వారాంతపు సెలవులు, పెరిగిన భవానీళ్లు స్వాముల రాకతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. కనకదుర్గమ్మ వారి కరుణాకటాక్షాల కోసం వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి ముడిసింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిలో దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నందుకు భక్తులు పెద్ద సంఖ్య లో రావడంతో ఆదివారం క్యూ లైన్ లన్నీ కిటకిటలాడాయి.
తెల్లవారుజాము నుండి క్రమక్రమంగా భక్తుల రాక పెరుగుతుండడంతో ఉచిత, రూ 100,300,500 క్యూలైన్లు భక్తులు కిక్కిరిసి ఉన్నారు. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రద్దీ మరింత ఎక్కువ అవడంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసిన అధికారులు వీఐపీ సిఫార్సు దర్శనాలను కూడా నిలుపుదల చేశారు.రూ 500 టికెట్ల జారిని నిలుపుదల చేసి అందరికీ బంగారు వాకిలి ద్వారానే అమ్మవారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనంలో సామాన్యులకే పెద్ద పీట వేసి త్వరగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశారు.

