నృసింహుడి ఆలయానికి పోటెత్తిన భక్తజనం
పెద్దపల్లి రూరల్, నవంబర్ 9(ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10న సోమవారం రథోత్సవం జరుగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయంలో క్యూలైన్లలో బారులుదీరారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే నృసింహా స్వామిని దర్శించుకుని భక్తులు పరవశించారు. రథోత్సవం రోజున జాతర జరగడం ఆనవాయితీ. కానీ ముందుగానే జాతరను తలపించింది. జాతర ప్రాంగణం భక్తజనసంద్రంగా మారింది. వివిధ మార్గాల నుండి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహక అధికారి శంకరయ్య, ఆలయ కమిటీ చైర్మన్ సదయ్య, ధర్మకర్తలు, దేవునిపల్లి, అండుగులపల్లి గ్రామాల ప్రముఖులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ నేతృత్వంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ మల్లేష్, సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. రాగినేడు పీ హెచ్ సీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాట్లను ఆ శాఖ అధికారులు పర్యవేక్షించారు.

