అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలి

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ
నిజామాబాద్‌ ప్రతినిధి, ఆంధ్రప్రభ:
నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. నగరంలోని 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల కార్పొరేషన్‌ కౌన్సిల్‌లో ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించామని తెలిపారు. కొన్ని డివిజన్లలో రూ.కోటి విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, మరికొన్ని చోట్ల త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అమృత్‌ 2.0 పథకం కింద నగరంలో భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులు కొనసాగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందూరులోని చారిత్రక ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్‌వే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, కంపెనీ ప్రతినిధులు పరిశీలన జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ కూరగాయల ఉమారాణి, కార్పొరేటర్లు వైష్ణవి సుధా, చింతకాయల రాజేందర్‌, ఎర్రం సుధీర్‌, బీజేపీ నాయకులు పవన్‌ ముందడ, శ్రీనివాస్‌, మారావార్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.