మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం?
మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం?
- అన్ని వర్గాలను గాలికొదిలేసిన ప్రభుత్వం
- కేటాయింపుల్లోనే మోసం కనిపిస్తుంది
- మా హయాంలో అప్పు ఎంత? ఇప్పుడెంత?
- హామీలు అమలు చేయకపోతే ఆందోళనలే
- కాంగ్రెస్ కు బీఆర్ఎస్ 100 రోజుల అల్టిమేటం
- ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు ధ్వజం
లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; మోసపూరిత బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ఐబీ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మూడో బడ్జెట్ లో ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండిచేయి ఇచ్చిందన్నారు. అంకెల గారడితో ఆదాయం లేనప్పటికీ, పొంతన లేని కేటాయింపులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా బీఆర్ఎస్ అప్పుల వలననే రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడటం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. మా ప్రభుత్వ హయాంలో తొమ్మిదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు కేవలం రెండున్నర ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3.75 లక్షల కోట్లు అని వివరించారు. తాము అప్పు చేసినప్పటికీ, అభివృద్ధి పనులు చేసి సంపదను పెంచినట్లు తెలిపారు. అసెంబ్లీ, కాళేశ్వరం, కలెక్టరేట్స్ సహా ఎన్నో నిర్మాణాలు చేసినట్లు వెల్లడించారు.
రైతు భరోసా, పెంచిన పెన్షన్స్, తులం బంగారం, నిరుద్యోగులకు జాబ్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు? రైతులకు ఎరువులు,మహిళలకు రుణాలు, ప్రసవనంతరం ఆసుపత్రి కిట్, ఎస్సీలకు సబ్సిడీ లోన్లు, పంటల కొనుగోలు, వడ్ల బోనస్, గురుకుల పాఠశాలల నిర్వహణ అనేవి ప్రభుత్వ అసమర్ధతను చూపిస్తున్నాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఆదాయం పెరిగితే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో 2 శాతం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు? ఫుట్ బాల్ ఆటలు, అందాల పోటీలు మినహాయించి ప్రభుత్వం పేదలకు ఏం చేస్తోందని విమర్శించారు.
పోలీసులను కూడా తమ స్వంత కార్యకర్తల్లాగా కాంగ్రెస్ నాయకులు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. చివరకు విలేకరులకు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలాలు కూడా పత్తా లేకుండా పోయాయని, ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కళ్ళు తెరవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇదే ఐబీ ఆవరణలో విలేకరులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా పాలన కంటే పార్టీ కార్యకర్తల పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని విమర్శించారు.
రోడ్డు వెడల్పు మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలి
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పట్టణంలోని రోడ్డు వెడల్పు పనులు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరగాలని, దీంట్లో అధికార, ప్రతి పక్ష పార్టీలనే పక్షపాతం లేకుండా అందరికీ సమన్యాయం జరగాలన్నదే బీఆర్ఎస్ వైఖరి అని తెలిపారు.అంతేకాకుండా బాధితులకు నిబంధనల మేరకు నష్ట పరిహారం చెల్లించాలని, వారి జీవనోపాధికి ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరుతున్నామన్నారు.
ఈ సమావేశంలో మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ సొల్లు సురేష్, నాయకులు మారిశెట్టి సుమన్,తిరుపతి,చిప్పకుర్తి నారాయణ,షేక్ చాంద్, గరిసే రవీందర్,దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
