రూ . 1152.96 కోట్లతో రామగుండం అభివృద్ధి
నగర మేయర్ మహంకాళి స్వామి
గోదావరిఖని, ఆంధ్రప్రభ: రామగుండం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. 2024 నుంచి 2026 వరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.1,152.96 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల పునరుద్ధరణకు రూ.12 కోట్లు, రామగుండంలోని హైస్కూల్ అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఎనిమిది కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సింగరేణి కాలనీలకు తాగునీటి సరఫరా కోసం సంస్థ రూ.50 కోట్లతో చేపట్టిన గ్రావిటీ ఫిల్టర్ పనులు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని, జవాబుదారీతనంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
ప్రమాదాల నివారణకే పైలాన్ తొలగింపు
గోదావరిఖనిలో పైలాన్ తొలగింపు అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని మేయర్ అన్నారు. రహదారి మధ్యలో ఉన్న పైలాన్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలోనే దానిని తొలగించినట్లు వివరించారు. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే చందర్ చేస్తున్న విమర్శలను ఖండించారు. బీఆర్‌ఎస్ నాయకులు రౌడీ రాజకీయాలను ప్రోత్సహించడం మానుకోవాలని సూచించారు. ఉద్యోగాల మాఫియా కారణంగా రామగుండంలో పలువురు యువకులు నష్టపోయారని ఆరోపించారు. కౌశిక్ హరి చేసిన విమర్శలను కూడా మేయర్ ఖండించారు.
