నేపాల్‌లో వరద విలయం.. 1200 దాటిన మృతుల సంఖ్య

  • 4,200 మందికిపైగా గల్లంతు..
  • 583 మంది విదేశీయులు
  • 83 మంది భద్రతా సిబ్బంది గల్లంతు..
  • కొనసాగుతున్న సహాయక, గాలింపు చర్యలు

కాఠ్మండు, ఆంధ్రప్రభ : నేపాల్‌–చైనా సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య 1,204కు చేరింది. మరో 4,200 మందికిపైగా ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. అలాగే, 83 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారని అధికార‌లు వెల్ల‌డించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో సహాయక, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఆగస్టు 26న హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు, శిలలు భారీగా కూలిపోవడంతో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. గ్లేసియర్ క్ర‌మంగా క‌రిగి కూలిపోవ‌డంతో… భారీగా నీరు, మట్టి, రాళ్లు దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. దీంతో మార్గమధ్యంలోని గ్రామాలు, నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో భారీగా శిథిలాలు పేరుకుపోవడంతో సహాయక బృందాలకు అక్కడికి చేరుకోవడం సవాల్‌గా మారింది.

గల్లంతైన వారిలో విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా తదితర దేశాలకు చెందిన పర్యాటకులు, ట్రెక్కర్లు, ఇతర ప్రయాణికులు ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తమ ఆప్తుల కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారి వివరాలను సేకరించి వారి కుటుంబాలతో సమాచారాన్ని అనుసంధానించే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.

నేపాల్‌ సైన్యం, పోలీసులు, సాయుధ భద్రతా బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 12 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మారుమూల ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మందులు, ఇతర అత్యవసర సామగ్రిని తరలిస్తున్నారు. దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించడంతో పాటు శిథిలాలను తొలగించే పనులు కూడా కొనసాగుతున్నాయి.

వరదల ధాటికి 40కిపైగా వంతెనలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులపై భారీగా పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుకు సాగుతున్నాయి. డ్రోన్లను ఉపయోగించి చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు. భారత్‌, చైనా సహా పలు దేశాలకు చెందిన నిపుణులు తాత్కాలిక వంతెనల నిర్మాణం, రక్షణ చర్యల్లో సహకరిస్తున్నారు.

ఇప్పటికే వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ.. గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉండటంతో సహాయక చర్యలు కీలక దశకు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించేందుకు భారీ యంత్రాలతో నిరంతరం పనిచేస్తున్నారు. మృతదేహాల గుర్తింపు కోసం నమూనాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో వివరాలను నిర్ధారించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.