పోలీసులపై కత్తితో దాడి.. ఆత్మరక్షణలో కాల్పులు
గంజాయి కేసులో ప్రధాన నిందితుడికి బుల్లెట్ గాయం
పెనమలూరు, ఆంధ్రప్రభ: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులపై కత్తితో దాడి చేసి పరారైన గంజాయి కేసు నిందితుడిని కృష్ణా జిల్లా పోలీసులు సాంకేతిక సమాచారంతో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 31న ఉదయం 6 గంటల సమయంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్నగూడెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి-16 సర్వీస్ రోడ్డుపై హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పీసీ-939 ఎన్.లోవరాజు, ఏఆర్ పీసీ-2978 వి.వెంకటేశ్వరరావులకు నలుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించారని తెలిపారు. వారి వద్ద రెండు బ్యాగులు, ఒక ద్విచక్ర వాహనం, ఒక స్కూటీ ఉండటంతో పోలీసులు వారిని ఆపి వివరాలు అడిగిన సమయంలో నిందితులు పదునైన కత్తితో దాడికి పాల్పడ్డారని చెప్పారు.
ఈ దాడిలో కానిస్టేబుల్ వి.వెంకటేశ్వరరావుకు మూత్రపిండాలు, ప్రేగులు, ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ తెలిపారు. అనంతరం నలుగురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని, దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అక్కిదాసరి అవినద్ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. అతడు, అతని సహచరులు గంజాయికి బానిసలై ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించాయని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసుల నుంచి అందిన సాంకేతిక సమాచారంతో నిందితులు ఉంగుటూరు–కంకిపాడు పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 1 తెల్లవారుజామున కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికొండ గ్రామ శివారులో వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలో పోలీసులు గాలింపు చేపట్టారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని, కిందపడిన అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కత్తితో దాడి చేశాడని ఎస్పీ వివరించారు.
అంతేకాక రాళ్లు విసిరి గన్నవరం సీఐ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశాడని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన గన్నవరం పీసీ-982 దేవిశెట్టి శ్రీనుపై కూడా కత్తితో దాడి చేయడంతో ఛాతి భాగంలో తీవ్ర గాయమైందన్నారు. సీఐలు పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిందితుడు కత్తితో దాడికి ప్రయత్నించడం కొనసాగించాడని చెప్పారు.
నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో తొలుత ఇద్దరు సీఐలు చెరొక రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపి హెచ్చరించినట్లు ఎస్పీ తెలిపారు. అయినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గకుండా కత్తితో దాడికి ప్రయత్నించడంతో పోలీసు సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు కంకిపాడు సీఐ ఆత్మరక్షణలో ఒక రౌండ్ కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో నిందితుడి మోకాలి దిగువ భాగంలో బుల్లెట్ గాయం కాగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన పేరు అక్కిదాసరి అవినద్‌గా వెల్లడించాడని, దేవరపల్లి ఘటనలో పోలీసులపై కత్తితో దాడి చేసిన ప్రధాన నిందితుడిగా అతడిని నిర్ధారించినట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన అవినద్, గన్నవరం పీసీ దేవిశెట్టి శ్రీనును కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. శ్రీను ఛాతి భాగంలో లోతైన గాయం కావడంతో రెండు కుట్లు వేసినట్లు తెలిపారు. నిందితుడు అవినద్‌ను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై గన్నవరం సీఐ ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తును సమగ్రంగా పర్యవేక్షించేందుకు గుడివాడ ఎస్డీపీవోను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు.
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు
గంజాయి మత్తులో పోలీసులపై దాడి చేయడం, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించడం వంటి చర్యలను ఎస్పీ తీవ్రంగా ఖండించారు. గంజాయిని అక్రమంగా రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతోందని తెలిపారు. యువతను గంజాయి వైపు, తద్వారా నేరాల వైపు నడిపించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
