Irrigation Water | ఎల్-3 కాల్వకు సాగునీరు అందించండి.. కలెక్టర్గారూ!
– ఎల్-3 కాల్వ కింద 600 ఎకరాలకు పైగా ఆయకట్టు
– పిచ్చిచెట్లతో నిండిన కాల్వ..నీటి ప్రవాహానికి అడ్డంకులు
– కుంటలు, చెరువులు నిండితే వందల ఎకరాలకు సాగునీరు
– ఖరీఫ్ పంట కీలక దశలో..నీటి కోసం రైతుల ఎదురుచూపులు
– దేవాదుల ద్వారా గోదావరి జలాలు విడుదల చేయాలని రైతుల విజ్ఞప్తి
Irrigation Water | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ: కళ్ల ముందే కాల్వలు ఉన్నాయి..పక్కనే రిజర్వాయర్ ఉంది.. కానీ పొలాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. ఖరీఫ్ పంటలు కీలక దశకు చేరుకున్న సమయంలో అవసరమైన సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. దేవాదుల ద్వారా గోదావరి జలాలను విడు దల చేసి ఎల్-3 కాల్వకు నీరందిస్తే కుంటలు, చెరువులు నిండి వందల ఎకరాల పంటలకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు చెబుతున్నా రు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత సాగునీటి శాఖ అధికారులు స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి నియోజకవర్గం వైపు వెళ్లే దేవాదుల మెయిన్ కెనాల్ నుంచి ఇప్పగూడెం, గుంటూరుపల్లి, సముద్రాల మీదుగా ఎల్-3 కాల్వ కొనసాగుతోంది. కూర్చపల్లి మెయిన్ కెనాల్ నుంచి గుంటూరుపల్లి వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఈ కాల్వ విస్తరించి ఉంది. అయితే కాల్వ ప్రారంభ ప్రాంతంలో ఎత్తు ఉండటంతో పాటు కాల్వలో పిచ్చిచెట్లు, చెత్తాచెదారం పేరుకుపోవడం తో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని రైతులు చెబుతు న్నారు.
-600 ఎకరాలకు పైగా ఆయకట్టు:
ఈ కాల్వ కింద సుమారు 600 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పెద్దకుంట, బండకుంట, సత్రంకుంట, రాయి కుంట, భవన్లకుంట, కొచ్చేరువు తదితర కుంటలు, చెరువులు ఈ కాల్వ పరిధిలో ఉన్నాయి. ఒక్కో కుంట కింద సుమారు 40 ఎకరాల వరకు సాగుభూమి ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఎల్-3 కాల్వకు పూర్తిస్థాయిలో నీరు అందితే ఆయా కుంటలు, చెరువులు నిండడంతో వాటి కింద ఉన్న వందల ఎకరాల సాగుభూమికి నీటి భరోసా లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
-పంట కీలక దశలో.. నీటి కోసం ఎదురుచూపులు:
ప్రస్తుతం ఖరీఫ్ పంటలు కీలక దశలో ఉన్నాయి. ఈ సమయంలో పంటలకు అవసరమైన నీరు అందకపోతే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బోర్లు, ఇతర నీటి వనరులపై ఆధారపడి పంటలను కాపాడుకునే ప్రయ త్నం చేస్తున్నామని చెబుతున్నారు. కాల్వలు ఉన్నప్పటికీ వాటి ద్వారా సాగునీరు అందకపోవడం తమకు ఇబ్బందిగా మారిందని వాపోతు న్నారు.
-కాల్వల్లో పిచ్చిచెట్లు.. నీటి ప్రవాహానికి అడ్డంకులు:
ఒకవైపు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఎల్-3 కాల్వలో పిచ్చిచెట్లు, చెత్తాచెదారం పేరుకుపోయిన పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. కాల్వలో అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహానికి అనుకూలంగా తీర్చిదిద్దితే దేవాదుల నుంచి విడుదలయ్యే నీటిని ఆయకట్టుకు సక్రమంగా తరలించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. నీరు విడుదలకు ముందే కాల్వను పరిశుభ్రం చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
-గోదావరి జలాలు విడుదల చేయాలి:
దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి ఎల్-3 కాల్వకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు. అదే సమయంలో కాల్వలో పేరుకుపోయిన పిచ్చిచెట్లు, చెత్తాచెదారాన్ని తొలగించి నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కాల్వ పరిస్థితిని పరిశీలించి, ఆయకట్టుకు సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతు న్నారు.
-కలెక్టర్గారూ..స్పందించండి:
పంట చేతికొచ్చే కీలక సమయంలో సాగునీరు అందించి తమ పెట్టు బడులను కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. అలాగే సంబంధిత సాగునీటి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కాల్వ పరిస్థితిని పరిశీలించి, పిచ్చిచెట్లు, చెత్తాచెదారం తొలగించడంతో పాటు ఎల్-3 కాల్వకు నీరు చేరేలా అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేవాదుల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి ఆయకట్టుకు సాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
