ఘనంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు

జీలుగుమిల్లి నుంచి టీ.నర్సాపురం వరకు భారీ బైక్‌ ర్యాలీ

టీ.నర్సాపురం, ఆంధ్రప్రభ: టీ.నర్సాపురం మండలంలో ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేతృత్వంలో జీలుగుమిల్లి నుంచి టీ.నర్సాపురం వరకు నిర్వహించిన భారీ బైక్‌ ర్యాలీకి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ముందుగా అప్పలరాజుగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. అనంతరం బండివారిగూడెంలో కేక్‌ కట్‌ చేసి గ్రామస్తుల తరఫున పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అక్కడి నుంచి బైక్‌ ర్యాలీగా టీ.నర్సాపురం చేరుకున్న ఎమ్మెల్యే.. ఎస్‌.ఎస్‌. కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సభా వేదిక వద్ద భారీ కేక్‌ను కట్‌ చేసి పవన్‌ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌ను పార్టీ నాయకులు, జనసైనికులు, అభిమానులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఆయన నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.

కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ జనసేన నాయకులు, కూటమి నేతలు, జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.