Former Minister Kakani | ప్రజాస్వామ్యమే గెలిచింది..

Former Minister Kakani | ప్రజాస్వామ్యమే గెలిచింది..

అధికార దుర్వినియోగాన్ని ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ ఘన విజయం
ధర్మం, ప్రజాతీర్పుదే పైచేయి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి


Former Minister Kakani | నాయుడుపేట, నవంబరు 3 (ఆంధ్రప్రభ ): నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది ప్రజాస్వామ్యమని, ప్రజాతీర్పు ముందు అధికార దుర్వినియోగం ఓడిపోయిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం సాధించిన సందర్భంగా మంగళవారం స్థానిక వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే అధికార పార్టీ, కొందరు అధికారులు కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొన్నాయని తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సమయంలోనూ రీకౌంటింగ్ పేరుతో నాటకీయ పరిణామాలు సృష్టించి వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. పదేళ్లు ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన సంజీవయ్యను సైతం పోలీసులు వాహనాల్లో ఎక్కించుకుని ఊరూరా తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. ఇన్ని అవరోధాలు ఎదురైనా మొదటి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యం సాధించి చివరకు విజయ ధ్రువీకరణ పత్రం అందుకున్నామని చెప్పారు.

ఈ విజయం నాయుడుపేట ప్రజలు, ఓటర్లు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. పోలీసులు తమ విధులను పక్కనపెట్టి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించిన కాకాణి.. పరిధి దాటి ప్రవర్తించిన అధికారులపై భవిష్యత్తులో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలకమైన నాయుడుపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, ఎంపీ గురుమూర్తి, పార్టీ పరిశీలకుడు బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు, వైసిపి నాయకులు సమన్వయంతో కృషి చేశారని కొనియాడారు. రాజేశ్వరమ్మ విజయాన్ని నాయుడుపేట ఓటర్లకు, విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసేవలో అనుభవం కలిగిన రాజేశ్వరమ్మ కుటుంబం నాయుడుపేట పురపాలక సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్న నమ్మకం ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసిపి జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, వైసిపి నాయకులు తంబిరెడ్డి మోహన్ రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, దబ్బల శ్రీమంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, ధనలక్ష్మి, మనోహర్ రెడ్డి, గోపిరెడ్డి, తంబిరెడ్డి సురేష్ రెడ్డి, తంబిరెడ్డి హేమ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.