నేపాల్‌లో జలప్రళయం… కళ్ల ముందే విధ్వంసం..
- భారతీయులు విలవిల
ఖాట్మాండు, ఆంధ్రప్రభ : నేపాల్‌లో వచ్చిన భారీ వరదలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరద ఉద్ధృతికి సంబంధించిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. తేరుకునేలోపే గ్రామాలపైకి దూసుకొచ్చిన నీటి ప్రవాహంలో ఎందరో చిక్కుకుపోయారు. వరద ఉద్ధృతి తగ్గిన ప్రాంతాల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు మరింత విషాదాన్ని నింపుతున్నాయి. జనంతో కళకళలాడిన ప్రాంతాలు బురద, శిథిలాలతో నిండిపోగా.. విధ్వంసం వదిలి వెళ్లిన విషాదపు ఛాయలు ప్రతి చోటా కనిపిస్తున్నాయి.


నేపాల్‌లోని మధ్య పర్వత ప్రాంతం రసువాలో భోటేకోషి నదికి వచ్చిన ఆకస్మిక వరద పెను విధ్వంసం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించిన వరద నీరు నదీ తీర ప్రాంతాలను ముంచెత్తింది. టిమురే, స్యాబ్రుబేసి సహా దిగువ ప్రాంతాల్లోని పలు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద తీవ్రతకు నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తేరుకునేలోపే గ్రామాల్లోకి వరద..

పర్వత ప్రాంతమైన రసువా జిల్లాలో నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే వరద గ్రామాల్లోకి దూసుకొచ్చింది. నదీ తీరంలోని ఇళ్లు, మార్కెట్ ప్రాంతాలు, రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ నీటి ప్రవాహానికి కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోగా.. మరికొన్ని బురద, రాళ్ల కుప్పల మధ్య చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాలు బురద, శిథిలాలతో నిండిపోయాయి. నీరు తగ్గిన తర్వాత బయటపడుతున్న దృశ్యాలు స్థానికులను మరింత కలచివేస్తున్నాయి.
ఆకాశ మార్గంలో సహాయక చర్యలు


విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నేపాల్ అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు, రక్షణ కార్యక్రమాల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు సమాచారం. రహదారి మార్గాలు దెబ్బతిన్న ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారానే సహాయక బృందాలు చేరుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అవసరమైన ఆహారం, మందులు, ఇతర అత్యవసర సామగ్రిని బాధిత ప్రాంతాలకు చేరవేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
విషాదం మిగిల్చిన విధ్వంసం..

టిమురే, స్యాబ్రుబేసి ప్రాంతాల్లో వరద వదిలి వెళ్లిన విధ్వంసం తీవ్రంగా ఉంది. నివాస ప్రాంతాలు దెబ్బతినడంతో పాటు మార్కెట్లు, రహదారులు, భద్రతా కేంద్రాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సాధారణ జనజీవనంతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు బురద, శిథిలాల మధ్య విషాదంగా కనిపిస్తున్నాయి.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మధ్య.. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రకృతి విపత్తు నేపాల్‌ను విషాదంలోకి నెట్టగా.. ప్రాణాలతో బయటపడిన వారు ఇప్పుడు తమ కళ్ల ముందే జరిగిన విధ్వంసాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.



