Delhi Assembly – ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ – ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ముర్ము ఓటేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు.కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మీ పురి, ఇతర కుటుంబసభ్యులు ఆనంద్ నికేతన్లో ఓటు వేశారు. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ జన్పథ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తన సతీమణితో కలిసి కె.కమ్రాజ్ లేన్లో ఓటు వేశారు.

ఓటు హక్కును వినియోగించుకోండి – మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పోలింగ్ గురించి కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇక్కడి ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మొదట ఓటు వేయండి, తరువాత రిఫ్రెష్మెంట్ అనే విషయాన్ని ప్రజలకు గుర్తుచేశారు.

ఇది ధర్మ యుద్ధం – ఢిల్లీ సిఎం అతిషి

ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు కేవలం ఎన్నికలే కాదు, ధర్మ యుద్ధం. ఇది మంచి చెడుల మధ్య జరిగే యుద్ధం. ఇది పనికి, గూండాయిజానికి మధ్య జరిగే పోరాటం. ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పనికి ఓటు వేయండి, మంచితనానికి ఓటు వేయండి. సత్యం గెలుస్తుంది. అని ఢిల్లీ సిఎం అతిషి ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు..

  • రాష్ట్రపతి ఎస్టేట్‌లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము
  • కె.కమ్రాజ్ లేన్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ
  • రాజ్ నివాస్ మార్గ్ లో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
  • కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ 
  • నిర్మాణ్ భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • తుగ్లక్ క్రెసెంట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన అర్ధాంగి 
  • ఆనంద్ నికేతన్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుటుంబం
  • జన్ పథ్ లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్
  • న్యూఢిల్లీ నియోజకవర్గంలో మనీశ్ సిసోడియా దంపతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *