మహబూబ్‌నగర్‌లో రక్షణ రంగ హబ్…
- డీఆర్‌డీఎల్‌కు తెలంగాణ భారీ కానుక
- రూ.1కే 416 ఎకరాల భూమి..
- రక్షణ రంగ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు
- 33 ఏళ్ల లీజుకు మహబూబ్‌నగర్‌లో స్థలం..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రక్షణ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్‌డీఎల్) చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు మహబూబ్‌నగర్ జిల్లాలో 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) అంగీకరించింది. ఈ భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుండగా.. మొత్తం భూమికి వార్షిక అద్దె కేవలం రూ.1గా నిర్ణయించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రక్షణ రంగ పెట్టుబడులు, డీఆర్‌డీఎల్ ప్రాజెక్టులు, ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 అంశాలపై చర్చించారు. దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు వివరాలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు కేటాయించే 416.18 ఎకరాల భూమికి 33 ఏళ్ల లీజు కాలపరిమితి ఉంటుందని సీఎం తెలిపారు. అవసరమైతే లీజును మరో రెండుసార్లు పొడిగించే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. రక్షణ పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం ఆహ్వానించారు. ఈ సదస్సులో భాగంగా నిర్వహించనున్న డిఫెన్స్ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని కోరారు.
రక్షణ రంగం, అంతరిక్షం, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు డిఫెన్స్ ఎక్స్‌పోలో ఉంటాయని సీఎం వివరించారు. ఎయిర్ షో, రక్షణ పరికరాల ప్రదర్శన, భూ ఆధారిత రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత వైమానిక దళ విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల భాగస్వామ్యానికి అవసరమైన సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఇదే సమావేశంలో ఆదిలాబాద్ విమానాశ్రయం అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా మొత్తం 1500 ఎకరాల భూమి అవసరమని, అందులో ఇప్పటికే 750 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. మరో 750 ఎకరాల భూమిని కూడా సేకరిస్తామని వెల్లడించారు.
తెలంగాణలో రక్షణ రంగ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్, డీఆర్‌డీవో ల్యాబ్‌ల వంటి రక్షణ రంగ సంస్థలు గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విదేశీ రక్షణ సంస్థలు, ప్రతినిధులతో సమావేశాలకు కూడా కేంద్ర రక్షణ శాఖ సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం. అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
