Deep Waters Force | స్మశాన వాటిక లేక గెడ్డ దాటి అంత్యక్రియలు

Deep Waters Force | దత్తిరాజేరు, ఆంధ్రప్రభ : మండలంలోని పెదకాద గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడంతో పీకలోతు నీటిలో రెండు పాడెలను తీసుకెళ్లి గ్రామస్తులు అంతిమయాత్ర నిర్వహించారు. గ్రామానికి సమీపంలోని ఏడోంపుల గెడ్డ అవతల వైపు అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో భారీ వర్షాల మధ్య మృతదేహాలను నీటిలో నుంచి తీసుకెళ్లారు. స్మశాన వాటిక లేకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం సాయంత్రం సామిరెడ్డి పరదేశమ్మ (65) అనారోగ్యంతో మృతి చెందారు. అదే రోజు రాత్రి నంగిరెడ్డి లక్ష్మునాయుడు (62) అల్ప రక్తపోటు కారణంగా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గ్రామంలో రెండు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

తుపాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏడోంపుల గెడ్డ గురువారం పెద్ద ఎత్తున పొంగి ప్రవహించింది. స్మశాన వాటికకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో గ్రామస్తులు పీకలోతు నీటిలో గెడ్డను దాటి మృతదేహాలను తీసుకెళ్లాల్సి వచ్చింది. గ్రామానికి స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.