డిసెంబర్‌లో ఎల్నినో ప్రళయం.. తెలంగాణలో 41 శాతం లోటు వర్షపాతం
సూపర్ ఎల్నినో దిశగా..
2027 నాటికి మరింత భయానక పరిస్థితులు..
ఆగస్టులో 41 శాతం తగ్గిన వర్షపాతం!
అల్పపీడనాలు ఉన్నా కురవని వర్షాలు..
భారీగా తగ్గిన వరి సాగు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ వాతావరణ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ఎల్నినో ప్రభావం రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎల్‌నినో ప్రభావం అత్యంత గరిష్టస్థాయికి చేరుకుంటుందని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ ప్రతికూల వాతావరణ మార్పు మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా మారే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ ప్రతికూల వాతావరణ మార్పు మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా మారే అవకాశముందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటాయని అంచనా వేశారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, కరువులు, తుఫానులు, తీవ్రమైన వేడిగాలుల సరళి మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో ఎల్నినో మరింత బలపడి, నవంబర్-డిసెంబర్ నాటికి గరిష్ట స్థాయికి చేరనుంది. ఇది గనక నిజమైతే.. గతంలో సంభవించిన అతి పెద్ద ఎల్నినోల రికార్డులన్నీ బద్దలవుతాయి.
సూపర్ ఎల్నినో దిశగా..
ఇప్పటికే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పెరిగి, సూపర్ ఎల్నీనో స్థాయికి చేరుకున్నాయని ట్రాపికల్ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో పర్యవసానాలు మానవాళి చరిత్రలోనే అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి ఇది పీక్ స్టేజ్‌కు చేరుకుని, ప్రపంచ ఉష్ణోగ్రతలను మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సూపర్ ఎల్నినో స్థాయికి చేరుకున్నాయని నిపుణులు వెల్లడించారు. ఎల్నినో కారణంగా పసిఫిక్ సముద్ర అంతర్భాగంలో ఉన్న వేడి, గతంలో తీవ్ర విపత్తులను సృష్టించిన 1982-83, 1997-98, 2015-16 నాటి శక్తివంతమైన ఎల్నినో తీవ్రతలను కూడా దాటిపోయింది. సముద్రం వేడెక్కుతున్న వేగం, అంచనా వేస్తున్న తీవ్రత, సముద్రంలో దాగి ఉన్న వేడి పరిమాణం.. ఇలా పలు అంశాల్లో ఈసారి అన్ని పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయని ప్రముఖ విశ్లేషకులైన కొలిన్ మెక్కార్తీ తెలిపారు.
2027 నాటికి మరింత భయానక పరిస్థితులు..
మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులతో ఈ శక్తివంతమైన ఎల్నినో తోడైతే.. 2027 ప్రారంభం నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వందల వేల సంవత్సరాలలో భూగ్రహం చూడని విపరీతమైన వేడి వాతావరణంలోకి మనం అడుగుపెట్టినట్లేనని పరిశోధకులు చెబుతున్నారు.
రాబోయే 12 నుంచి 18 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ వైపరీత్యాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువులు, వర్షపాతం, రుతుపవనాల గమనంలో మార్పులు, మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి.. రాబోయే కొన్ని నెలలు భూమి వాతావరణ వ్యవస్థకు అత్యంత తీవ్రమైన పరీక్షా కాలంగా మారనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆగస్టులో 41 శాతం తగ్గిన వర్షపాతం!
ఎల్నినో దెబ్బకు రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. డిసెంబరులో ఎల్నినో మరింత కరువు పరిస్థితులను తీసుకురానుందన్న హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వానాకాలం సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తెలంగాణవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతోంది.
వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం, ముఖ్యంగా ఆగస్టు నెలలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటివరకు చూస్తే రాష్ట్రంలో సాధారణం కంటే వర్షపాతం 41 శాతం తగ్గిపోయింది. మొత్తం 28 జిల్లాల్లో వర్షపాతం లోటు ఏర్పడగా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ అనే 6 జిల్లాల్లో 60 శాతానికి పైగా లోటు నమోదైంది. ఒక్క కామారెడ్డి జిల్లాలో మాత్రమే సాధారణం కంటే కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదైంది.
జూలై ఆఖరు వారంలో కురిసిన భారీ వర్షాల వల్ల మొత్తం మాన్సూన్ సీజన్ సగటున ప్రస్తుతం 15 శాతం లోటులో మాత్రమే ఉన్నప్పటికీ, ఆగస్టు నెల పరిస్థితులు మాత్రం గడ్డుకాలాన్ని తలపిస్తున్నాయి.
అల్పపీడనాలు ఉన్నా కురవని వర్షాలు..
బంగాళాఖాతంలో వరుసగా 5 సార్లు అల్పపీడనాలు ఏర్పడి, అందులో 3 సార్లు వాయుగుండాలుగా మారినప్పటికీ తెలంగాణకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. వాయుగుండాలన్నీ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏర్పడి వాయువ్య దిశగా ప్రయాణిస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎల్నినో దెబ్బకు ఖరీఫ్‌లో దాదాపు 35 లక్షల ఎకరాల మేర పంటల సాగు తగ్గింది. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి విస్తీర్ణం దాదాపు 30 లక్షల ఎకరాల మేర తగ్గిపోవడం గమనార్హం. ఏటా ఖరీఫ్‌లో అధికారికంగానే 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంటుంది. అనధికారికంగా వరిసాగు వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో ఉంటుందని అంచనా.
అయితే ఈసారి ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో 40 లక్షల ఎకరాల్లోనే వరి సాగయింది. మరో 15 రోజుల్లో వరి సాగు అదను కూడా ముగుస్తోంది. ఇప్పటికే పోసిన వరి నార్లు పొలం తడవక ముదిరిపోతున్నాయి. ఇక పత్తి ఏటా 50 లక్షల ఎకరాల్లో తెలంగాణలో సాగయ్యేది.
భారీగా తగ్గిన వరి సాగు..
ఈ ఏడాది తెలంగాణలో పత్తి సాగు 41 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇక పప్పుధాన్యాల సాగు 6.38 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 5.31 లక్షల ఎకరాల్లో, నూనెగింజలు 3.79 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3.72 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి.
మొత్తంగా వానాకాలంలో కోటి 32 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా ఈ ఏడాది ఎల్నినో కారణంగా అన్ని పంటల సాగు కలిపి కోటి ఎకరాలకే పరిమితమైంది. అయితే ప్రస్తుతం ఆగస్టు చివరి వారంలో ఏమైనా కొత్త అల్పపీడనం ఏర్పడితే తప్ప వర్షాలు కురిసే సూచనలు కనిపించకపోవడంతో సెప్టెంబరులో పరిస్థితులు సాధారణంగానే ఉంటాయని భావిస్తున్నందున యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
