420 హామీలతో కాంగ్రెస్‌ మోసాన్ని ప్రజలకు వివరిస్తాం

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం: మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం పెద్దపల్లిలో ఆయన ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు వ్యవసాయ మార్కెట్‌ నుంచి బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను ప్రదర్శిస్తూ 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇంకా అమలు చేయాల్సిన, ప్రజలకు చెల్లించాల్సిన హామీల వివరాలతో కూడిన ‘బాకీ కార్డులను’ ఇంటింటికీ పంపిణీ చేయాలని తెలిపారు.

మండల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్‌, కౌన్సిలర్‌ వెన్నం సుజాత రవీందర్‌, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్‌, స్రవంతి మోహన్‌రావు, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, రాంరెడ్డి, మల్లేశం, దేవయ్య, బోయిని రాజమల్లు, సుల్తానాబాద్‌ పట్టణ అధ్యక్షుడు పారుపల్లి గుణపతి, కౌన్సిలర్‌ ఓదెలు, దీకొండ భూమేష్‌, బోయిన శ్రీనివాస్‌, లావణ్య, ఓజా సంపత్‌, గొడుగుల సతీష్‌, తోగరు శ్రీనివాస్‌, పాఠకుల అనిల్‌, మచ్చ అరుణ-యాదగిరి, సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.