దసరా వేడుకల్లో కళా ప్రదర్శనలకు అవకాశం
అమ్మవారి సన్నిధిలో సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు దరఖాస్తుల ఆహ్వానం
అక్టోబరు 5లోగా దరఖాస్తులు..
బృందంలో ఆరుగురికే అవకాశం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కళాకారులకు అవకాశం కల్పించనున్నారు. శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక, భక్తి సంగీత, నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన కళాకారులు, కళాబృందాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఈవో వి.కె. శీనానాయక్ తెలిపారు. శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, హరికథ, భక్తిరంజని, భజన, బుర్రకథ, కోలాటం, నాటకం తదితర సంప్రదాయ కళారూపాల్లో ప్రావీణ్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక కళాబృందంలో ప్రధాన కళాకారుడితో కలిపి గరిష్ఠంగా ఆరుగురికే ప్రదర్శనకు అవకాశం ఉంటుందని, అమ్మవారి దర్శనానికి కూడా ఈ ఆరుగురు సభ్యులనే ఒక బృందంగా అనుమతిస్తామని తెలిపారు.
దేవస్థానం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు అందుబాటులో ఉందని, దాన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో సమర్పించాలని ఈవో సూచించారు. దరఖాస్తుతో పాటు లలిత కళల్లో డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులు, కళారంగంలో అనుభవం, గత ప్రదర్శనలకు సంబంధించిన పత్రికా క్లిప్పింగులు, ఫొటోలు, ప్రశంసా పత్రాలు జత చేయాలని తెలిపారు. ప్రధాన కళాకారుడి ఆధార్, మొబైల్ నంబర్‌తో పాటు బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్‌ను ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ స్పష్టంగా కనిపించేలా సమర్పించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను దేవస్థాన కార్యాలయానికి పోస్టు ద్వారా, నేరుగా లేదా ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తులు అక్టోబరు 5లోగా దేవస్థానానికి చేరాలని, గడువు తర్వాత అందే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 1800 425 9099 టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలని సూచించారు.
